రేగులమాణ్యంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

రేగులమాణ్యంలో చోరీ

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలోని రేగులమాణ్యం కాలనీకి చెందిన పాశం గోపయ్య ఇంట్లో చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోపయ్య ఈ నెల 16వ తేదీ వరంగల్‌ వెళ్లగా ఆయన భార్య సంజీవమ్మ ఆ కాలనీలోని పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వంట చేయడానికి ఇంటి నుంచి ఉదయం 10 గంటల సమయంలో వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 1.30 గం. ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలగొట్టి అందులో దాచుకున్న రూ.40 వేల నగదుతో పాటు రూ.3.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.42 వేలు విలువైన 20 తులాల రెండు జతలు వెండి పట్టీలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గమనించింది. వెంటనే వరంగల్‌ వెళ్లిన భర్త గోపయ్యకు చోరీ విషయం తెలపగా ఆయన సోమవారం రాత్రి ఇంటికి వచ్చి మంగళవారం రాత్రి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం నరసరావుపేటకు చెందిన క్లూస్‌టీం ఆధారాలను సేకరించారు. గోపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

పిడుగురాళ్ల: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో పంజాబీ దాబా సమీపంలో బుధవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు.. బొల్లాపల్లి మండలం గుమ్మనండపాడు గ్రామానికి చెందిన పారా కోటేశ్వరరావు (59) తన కుమార్తెను పిడుగురాళ్లకు చెందిన వ్యక్తితో వివాహం చేశాడు. ఈ క్రమంలో అల్లుడుకు చెందిన పొలాన్ని సాగు చేస్తూ పిడుగురాళ్లలోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే కోటేశ్వరరావుతోపాటు అతని భార్యదేవి ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా బైపాస్‌ రోడ్డులోని పంజాబీ దాబా వద్ద హైదరాబాద్‌ వైపు నుంచి యద్దనపూడి వెళుతున్న కారు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, కోటేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగరాజు పేర్కొన్నారు.

ప్రకృతి ఉత్పత్తులకు ప్రీమియం ధరలు

కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌(పీజీఎస్‌) ధ్రువీకరణతో గుర్తింపుతో పాటు మెరుగైన ధరలు, మార్కెటింగ్‌ అవకాశాలు లభిస్తాయని ఏపీ ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ(ఏపీఎస్‌ఓపీసీఏ) జోనల్‌ కో–ఆర్డినేటర్‌ మహిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పీజీఎస్‌ ధ్రువీకరణ ప్రక్రియపై స్థానిక కృషి భవన్‌లో బుధవారం ప్రకృతి వ్యవసాయ క్షేత్ర స్థాయి సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌పీఎంయూ ప్రాజెక్టు మేనేజర్‌ హర్ష, గుంటూరు డీపీఎంయూ ప్రతినిధి సుమ పాల్గొన్నారు.

వ్యక్తిపై కత్తులతో దాడి

నరసరావుపేట టౌన్‌: వ్యక్తిపై ఇద్దరు కత్తులతో దాడి చేసిన సంఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ బుధవారం తెలిపారు. వరవకట్ట ప్రాంతానికి చెందిన ఉదయగిరి వెంకటస్వామి పై పాతకక్షల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన చల్లా గణేష్‌, చల్లా పెద్దన్నలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

జిల్లా స్థాయిలో వ్యాస రచన, క్విజ్‌ పోటీలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌(స్వీప్‌) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. నోడల్‌ కళాశాలగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ మహిళా కళాశాల ఎలక్ట్రోరల్‌ లిటరసీ క్లబ్‌, రాజకీయ శాస్త్ర విభా గ ఆధ్వర్యంలో ఎలక్ట్రోరల్‌ లిటరసీ క్లబ్‌ కోఆర్డినేటర్‌ బి.లలితబాబు, రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు బి.క్యూరీ పర్యవేక్షణలో నిర్వహించిన పోటీల్లో మంగళగిరి, తాడికొండ, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వివిధ కళాశాలల విద్యార్థినులు జిల్లా స్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్విజ్‌ పోటీల్లో గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ఎండీ నాజియా ఫిర్దోస్‌, మస్తాన్‌ బీ ప్రథమ బహుమతి కై వసం చేసుకోగా, జీవీఆర్‌ అండ్‌ ఎస్‌ కళాశాలకు చెందిన ఐ.భావన, వి.సాత్విక ద్వితీయ బహుమతిని పొందారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా వేమూరపు శ్రుతి(ప్రభుత్వ మహిళా కళాశాల), ఎస్‌కే నాజియా(ఎస్‌.జీ. ఓరియంటల్‌ డిగ్రీ కళాశాల, తాడికొండ) ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుపొందారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డి.కళ్యాణి మాట్లాడుతూ విద్యార్థినులు ఇటువంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement