లక్ష్మీపురం: మహిళ మెడలో బంగారు ఆభరణాన్ని అపహరించి పరారైన ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. విజయపురి కాలనీ 3వ లైన్ వద్ద డాక్టర్ కేఎల్‌పీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ప్రమీల జోషి, స్కూల్ బస్సులో వచ్చి, విజయపురి కాలనీ మెయిన్ రోడ్డులో దిగి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం ఆమె చేతిలో ఉండిపోగా, మిగిలిన భాగాన్ని నిందితుడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కేకలు విని సమీప నివాసి రాధా బయటకు వచ్చి ఆమెతో కలిసి నిందితుడిని వెంబడించినప్పటికీ పట్టుకోలేకపోయారు. సమాచారం తెలుసుకున్న పట్టాపురం సీఐ సిబ్బందితో ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలిరూరల్: పోలీసుల అదుపులో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బొద్దింకల స్ప్రే నోట్లో కొట్టుకోవడంతో పోలీసులు వైద్యశాలకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ సీఎం కాలనీకి చెందిన 18 ఏళ్ల వంశీ తన వెంట పడి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అదే కాలనీకి చెందిన 27 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో యువకుడిని స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ ఆవరణలోని మరుగుదొడ్డికి బుధవారం ఉదయం వెళ్లిన వంశీ అక్కడ ఉన్న బొద్దింకల నివారణ స్ప్రేను నోట్లో కొట్టుకున్నాడు. గమనించిన పోలీసులు అతన్ని ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. డిశ్చార్జి అనంతరం కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలు ఇచ్చి పంపారు.
ఎరువుల బుకింగ్‌కు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్
కొరిటెపాడు(గుంటూరు): రైతులకు సబ్సిడీ ఎరువులను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్(ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్) యాప్, పంటల బీమా పథకంపై గుంటూరు సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే) సిబ్బందికి బుధవారం కృషి భవన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి మాట్లాడుతూ సిబ్బంది యాప్‌పై పూర్తి అవగాహన పెంచుకుని గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతులు ఫార్మర్ ఐడీ లేదా ఆధార్‌తో లాగిన్ అయి భూమి, పంట వివరాలు నమోదు చేసి అవసరమైన ఎరువులను ముందుగా బుక్ చేసుకోవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా ఎరువుల దుకాణాల్లో పొందవచ్చని తెలిపారు. గుంటూరు ఏడీఏ ఎన్.మోహనరావు మాట్లాడుతూ రబీ–2026లో పెసర, మినుము, శనగ, జొన్న, మొక్కజొన్న పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) అమలవుతోందని అన్నారు.


