బంగారం వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బంగారం వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

బాపట్ల: బంగారం ధరలు పెరగటంతో వ్యాపారస్తులు షాపుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో బంగారం దుకానాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 257 బంగారు, వెండి ఆభరణాల దుకాణాలను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, వ్యాపార సముదాయాల భద్రతను పెంచుకోవాలని సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాల ఘటనలను, పెరిగిన బంగారం ధరలను దృష్టిలో ఉంచుకుని బంగారు, వెండి వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బంగారు దుకాణం యజమాని తమ వ్యాపార సముదాయంలోని లోపలి, వెలుపల, కౌంటర్లు, స్ట్రాంగ్‌ రూమ్‌లు పూర్తిగా కనిపించే విధంగా అత్యాధునిక నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచాలని, రాత్రి సమయాల్లో కూడా స్పష్టమైన దృశ్యాలు రికార్డయ్యేలా నైట్‌ విజన్‌ కెమెరాలను వినియోగించాలని తెలిపారు. దొంగతనాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసే బర్గర్‌ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరింత భద్రత పొందవచ్చని సూచించారు. వ్యాపార సముదాయాల వద్ద పోలీస్‌ శాఖ సూచించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ తమ విలువైన ఆస్తులను కాపాడుకోవాలని తెలిపారు. సరైన ఆధారాలు లేని బంగారం, వెండి ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని హెచ్చరించారు. పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు సూచించే భద్రతా చర్యలను అమలు చేయడం ద్వారా దొంగతనాలను గణనీయంగా అరికట్టవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీతోపాటు అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.సుధాకర్‌, బాపట్ల, చీరాల డీఎస్పీలు సీహెచ్‌ చంద్రమౌళి, ఎం.డి. మోయిన్‌, ఐటీ కోర్‌ ఇనన్‌స్పెక్టర్‌ వి.సూర్యనారాయణ, బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.సురేష్‌, కె.వి.బ్రహ్మయ్య, వి.శ్రీను, జిల్లాలోని బంగారు, వెండి వ్యాపారులు, పాన్‌ బ్రోకర్లు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement