వార్డుల పునర్విభజన మొదలు ఓటర్ల జాబితా తారుమారు వరకు?
టీడీపీకి అనుకూలంగా అధికార యంత్రాంగం అడ్డగోలు నిర్ణయాలు
జీఎంసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
నెహ్రూనగర్: అనుకున్నదే జరిగింది. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కలిసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ‘సాక్షి’ మొదటి నుంచి చెబుతున్న విధంగానే... అధికార పార్టీ నాయకుల కోసం అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలేశారు. ఫలితంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరుఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ వార్డుల్లో గెలుపొందారు.
అడ్డగోలుగా వార్డుల పెంపు..
గతంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 57 వార్డులు మాత్రమే ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 76 వార్డులకు పెంచింది. ఈ వార్డుల ప్రక్రియ అంతా శాసీ్త్రయంగా జరగాల్సి ఉండగా, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిళ్లతో అధికారులు ఇష్టానుసారంగా, అడ్డగోలుగా మార్చేశారు. కేవలం అధికార పార్టీకి ఎక్కడెక్కడ బలముంది, ఎక్కడెక్కడ వైఎస్సార్ సీపీని దెబ్బతీయవచ్చనే లెక్కలతోనే ఈ సరిహద్దుల విభజన సాగింది.
ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు..
వార్డుల పెంపుతో ఆగకుండా.. ఓటర్ల జాబితా ప్రచురణలోనూ యంత్రాంగం తీవ్ర పక్షపాతం ప్రదర్శించింది. వైఎస్సార్ సీపీ గెలిచే అవకాశం ఉన్న పటిష్టమైన వార్డుల్లోని ఓటర్లను వేరే వార్డులకు మార్చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించాల్సిన స్థానాల్లో కూడా, కూటమి అభ్యర్థులే గెలిచేలా మార్పులు చేశారు.
గోప్యంగా ఉండాల్సిన సమాచారం టీడీపీ నేతల చేతికి..
ఇక రిజర్వేషన్ల ప్రక్రియలోనూ అధికారికంగా అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని, అధికార పార్టీ వర్గానికి చెందిన కొందరు అధికారులు టీడీపీ నేతలకు ముందుగానే చేరవేసి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. వార్డుల పెంపు నుంచి, ఓటర్ల జాబితా ప్రచురణ వరకు, వార్డు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రతి సున్నితమైన సమాచారాన్ని ముందుగానే అధికార పార్టీ నేతలకు, వారికి అనుకూలమైన పచ్చ మీడియాకు వాట్సాప్ ద్వారా చేరవేశారు. ఈ వ్యవహారంలో గోప్యత ఉల్లంఘన బయటపడినప్పుడు, జీఎంసీ కార్యాలయంలో పనిచేసే ఓ సాధారణ చిరుద్యోగిని బలి చేసి, అసలు సూత్రధారులను మాత్రం పెద్ద మనసుతో వదిలేశారనే విమర్శలున్నాయి.
కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దౌర్జనం
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్‌లోనూ అధికార పార్టీ జులుం ప్రదర్శించింది. ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపును అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చి అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వివరాలు.. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింక శ్రీనివాసరావు 87 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓట్ల లెక్కింపులో కొన్ని సాంకేతిక తేడాలు ఉన్నాయని, వెంటనే తిరిగి రీకౌంటింగ్ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అభ్యర్థి కౌంటింగ్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అధికారులతో చర్చిస్తుండగా.. విషయం తెలుసుకున్న స్థానిక తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హుటాహుటిన కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. కౌంటింగ్ హాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.. రిటర్నింగ్ అధికారి(ఆర్వో), ఏఆర్వోలతో పాటు ఇతర కౌంటింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ చేసే ప్రసక్తే లేదని, వెంటనే తమ టీడీపీ అభ్యర్థికే డిక్లరేషన్ ఫాం ఇవ్వాలని అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడికి తలవంచిన అధికారులు, నిబంధనలను పక్కనబెట్టి చేసేదేమీ లేక భయపడిపోయి చివరికి టీడీపీ అభ్యర్థికే డిక్లరేషన్ ఫాం అందజేశారు. ఎన్నికల అధికారులపై ఎమ్మెల్యే నేరుగా దౌర్జన్యానికి పాల్పడినా నిలువరించలేని పరిస్థితి నెలకొనడంపై యంత్రాంగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


