రేపల్లె: రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రి కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు సాగింది. ఉదయం 7 గంటలకు కౌటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్ష ప్రభావంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. నాలుగు రౌండ్‌లలో అభ్యర్థుల విజయాలను వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కుర్రా అవర్ణ 14,371 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 28, వైఎస్సార్‌సీపీ 3, జనసేన 3, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 వార్డులో గెలుపొందారు. మరోవైపు 3, 30వ వార్డుల ఫలితాల విషయంలో రీకౌంటింగ్ వ్యవహారం ఉత్కంఠకు దారితీసింది. మూడో వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొరిగిపూడి సుధీర్ జనసేన అభ్యర్థి పరిశా రాజుపై 13 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే జనసేన నాయకులు రెండుసార్లు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు మళ్లీ ఓట్లను లెక్కించారు. రెండుసార్లు రీకౌంటింగ్ చేసినప్పటికీ సుధీర్ 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయినప్పటికీ ఫలితాన్ని అంగీకరించకుండా మరోసారి రీకౌంటింగ్ కోరడంతో ఎన్నికల అధికారి అభ్యంతరం వ్యక్తం చేసి వైఎస్సార్ సీపీ అభ్యర్ధి సుధీర్ విజయాన్ని ప్రకటించారు. అదేవిధంగా 30వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కర్రి వెంకట కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి తులసీ దుర్గాప్రసాద్‌పై తొలుత 104 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే టీడీపీ నాయకులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారుల అనుమతితో మరోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కర్రి వెంకట కృష్ణారెడ్డి 104 ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించటంతో ఎన్నికల అధికారులు కృష్ణారెడ్డి విజయాన్ని ప్రకటించారు. రీకౌంటింగ్ సమయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఫలితాలను మార్చేందుకు కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అయితే రెండుసార్లుగా జరిగిన లెక్కింపులోనూ ఫలితాలు మారకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఖరారైంది. మూడో వార్డులో గొరిగిపూడి సుధీర్, 30వ వార్డులో కర్రి వెంకట కృష్ణారెడ్డి తమ విజయాలను నిలబెట్టుకున్నారు. వీటితో పాటు 25వ వార్డులో కర్రా రత్నాకర్ 126 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


