నగరంపాలెం: మురసు తుఫాన్ దృష్ట్యా జిల్లాలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో రహదారులపై కూలిన చెట్లను తొలగించారు. గుంటూరు–పర్చూరు రోడ్డులోని పెదనందిపాడు వద్ద రహదారిపై, తాడికొండ అడ్డరోడ్డు వద్ద కూలిన చెట్లను తొలగించి రాకపోకలు క్రమబద్దీకరించారు. గుంటూరు మూడు వంతెనల వద్ద భారీగా వర్షపు నీరు చేరగా, ట్రాఫిక్ డీఎస్పీ, సిబ్బంది అక్కడి పరిస్థితులను చక్కదిద్దారు. ప్రత్తిపాడు మండలం చిన్నకోండ్రుపాడురోడ్డులో నీటి ప్రవాహం అధికంగా ఉన్న వాగు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. లోతట్టు ప్రాంతాలల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలు, కాలువలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రమాదకరంగా ప్రవహించే నీటిని దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలు, హెచ్చరికలను విధిగా పాటించాలని కోరారు.
పోలీసుల సహాయక చర్యలు
Nov 4 2026 2:02 AM | Updated on Nov 4 2026 2:02 AM
● గుంటూరు నగరంలో పీకలవాగు డ్రెయిన్ పొంగి రోడ్లపైకి ప్రవహించడంతో పోలీసులు అప్రమత్తమై, పరిసర ప్రాంతాల ప్రజలను బయటకు రావద్దని సూచించారు. ఏటీ.అగ్రహారం కంకరగుంట అండర్‌పాస్ వద్ద నీరు చేరగా వాహనాలు వెళ్లకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు. అరండల్‌పేట మూడు వంతెనల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Advertisement


