ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు
మంగళగిరి టౌన్: ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతతోపాటు సంస్థ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)ను మరింత బలోపేతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. డిసెంబర్‌లో జరగనున్న ఏపీఎస్‌ఆర్టీసీ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఈయూ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఉద్యోగులను కోరారు. మంగళగిరి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో డిపో అధ్యక్షుడు బి.సాంబశివరావు అధ్యక్షతన, డిపో కార్యదర్శి వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈయూ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన గుంటూరు–2, విజయవాడ విద్యాధరపురం, నెల్లూరు–2, మంగళం డిపోల పునర్నిర్మాణ పనులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆరు నెలల్లోగా ఈ నాలుగు డిపోలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ఈ మేరకు హామీ లభించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వి.స్వామి మాట్లాడుతూ ఉద్యోగులు వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమిష్టి ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ యూనియన్‌ను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఇ.విజయకుమార్ మాట్లాడుతూ మంగళగిరి డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్యూటీ చార్టులను ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా తక్షణమే అమలు చేయాలని కోరారు.


