తుపాను నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

తుపాను నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు

Nov 4 2026 2:02 AM | Updated on Nov 4 2026 2:02 AM

బాపట్ల మురసు తుపాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పోలీసు వాహనాల ద్వారా వేగంగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన చీరాల, రామాపురం, వాడరేవు బీచ్‌ ప్రాంతాలను ఎస్పీ మంగళవారం సందర్శించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున పర్యాటకులు, ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేంతవరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మురసు తుపాను బాపట్ల జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిందని ఎస్పీ తెలిపారు. తుపాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు 224 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో 18 క్యూఆర్టీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుపాను తీరం దాటిన అనంతరం వీచిన బలమైన ఈదురుగాలుల కారణంగా బాపట్ల జిల్లాలో మొత్తం 333 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. రోడ్లపై, నివాస గృహాలపై పడిన చెట్లతో పాటు హోర్డింగ్‌లను కూడా వేగంగా తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 67 పునరావాస కేంద్రాలకు 2,650 మందిని తరలించడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను వేగంగా తరలించడానికి పోలీస్‌ వాహనాలను వినియోగించడం జరిగిందన్నారు. రెండు రోజులపాటు జిల్లా పోలీస్‌ యంత్రాంగం నిరంతరాయంగా పనిచేసిందన్నారు.

అందుబాటులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

సముద్ర తీర ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు 2 ఎస్డీఆర్‌ఎఫ్‌, 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం జిల్లాపై కొనసాగే అవకాశం ఉందని, పల్నాడు, ప్రకాశం తదితర ఎగువ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు వాగుల ద్వారా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాగులు, ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని, లోలెవల్‌ బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహించే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకొల్లు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగండ్ల వాగు వద్ద, బాపట్ల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సూర్యలంక రహదారిపై ఉన్న లోలెవల్‌ బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మార్టూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారి–16పై సుమారు నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహించిన సమయంలో వాహనాల రాకపోకలను నిలిపివేశామని, ప్రస్తుతం నీటి ఉధృతి తగ్గడంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం జిల్లా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 8333813228 , డయల్‌ 112కు కాల్‌ చేసి సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీపాటు అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.సుధాకర్‌, చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

–జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement