స్ట్రోక్ ప్రమాదాన్ని
పెంచే అంశాలు
స్ట్రోక్ వచ్చినప్పుడు ఇలా చేయాలి
స్ట్రోక్ లక్షణాలు..
యుక్త వయసులోనే పక్షవాతం
అప్రమత్తంగా ఉండాలంటన్న వైద్యులు
ముందస్తు జాగ్రత్తలతో స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు
నేడు వరల్డ్ స్ట్రోక్ డే
గుంటూరు మెడికల్: ప్రజల్లో చాలా మందికి హార్ట్స్ట్రోక్పై ఉన్నంత అవగాహన బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) పై లేకపోవటం వల్లే చాలా మంది స్ట్రోక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో పెద్దవయస్సువారిలో మాత్రమే వచ్చే పక్షవాతం నేడు మూడు పదుల వయస్సు దాటకుండానే వస్తోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షవాతం(స్ట్రోక్)పై అవగాహన కల్గి ఉండే నూటికి 80శాతం పక్షవాతం ద్వారా సంభవించే మరణాలు నివారించవచ్చు. పక్షవాతంపై ప్రజల్లో అవగాహక కల్పించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?
మెదడులోని ప్రతి కణానికి నిరంతరం రక్తం, ఆక్సిజన్ అందాలి. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడినా, రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం జరిగినా బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది.
స్ట్రోక్‌లో రకాలు...
1. ఇస్కీమిక్ స్ట్రోక్: రక్తనాళంలో రక్తపు గడ్డ ఏర్పడటం లేదా ఇతర కారణాల వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడం లేదా నిలిచిపోవడం.
2. హెమరాజిక్ స్ట్రోక్: మెదడులోని రక్తనాళం చిట్లి రక్తస్రావం జరగడం. ఈ రెండు పరిస్థితులూ అత్యవసర వైద్య సహాయం అవసరమయ్యే సమస్యలే. అయితే వాటికి అందించే చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు వైద్య పరీక్షలు, మెదడు స్కానింగ్ లేకుండా స్వయంగా మందులు వాడటం ప్రమాదకరం.
అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, అధిక ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవటం, పోషకాహార లోపం, మద్యపానం స్ట్రోక్‌కు దారితీస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టే సమస్యలు, కొన్ని రక్తం గడ్డకట్టే వ్యాధులు, నిర్దిష్ట రక్తనాళాల లోపాలు కూడా యువతలో స్ట్రోక్‌కు కారణం కావచ్చు.
స్ట్రోక్ అనుమానం వచ్చిన వెంటనే అత్యవసర వైద్య సేవలకు ఫోన్ చేసి, స్ట్రోక్‌కు తగిన చికిత్స అందించగల ఆసుపత్రికి చేరుకోవాలి. లక్షణాలు మొదలైన సమయాన్ని లేదా రోగి చివరిసారిగా ఎలాంటి లక్షణాలు లేకుండా సాధారణ స్థితిలో ఉన్న సమయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది చికిత్స నిర్ణయించడంలో వైద్యులకు సహాయపడుతుంది. రోగికి ఆహారం, నీరు లేదా నోటిమార్గంలో మందులు ఇవ్వకూడదు. వైద్యుల సూచన లేకుండా ఆస్పిరిన్,ఇతర రక్తం పలుచబరిచే మందులు ఇవ్వకూడదు. కొన్ని చికిత్సలు పరిమిత సమయ వ్యవధిలోనే అందించాల్సి ఉంటుంది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం అత్యంత ముఖ్యం. స్ట్రోక్‌లో ప్రతి నిమిషం విలువైనదే.
– డాక్టర్ పమిడిముక్కల విజయ, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్
స్ట్రోక్ లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోవడం, ఒక చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం లేదా మొద్దుబారడం, మాట తడబడటం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, అకస్మాత్తుగా చూపు తగ్గడం, రెండు వస్తువులుగా కనిపించడం, తీవ్రమైన తలతిరుగుడు, నడవలేకపోవడం, సమతుల్యత కోల్పోవడం లేదా కారణం తెలియకుండా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం కూడా ప్రమాద సంకేతాలు కావచ్చు. లక్షణాలు కొద్దిసేపట్లో తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. అవి తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ లక్షణాలు కావచ్చు. ఇది భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి హెచ్చరిక కావచ్చు. లక్షణాలు తగ్గిపోయాయని ఇంట్లోనే ఉండిపోకుండా తక్షణ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.


