ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు
లక్ష్మీపురం: అర్నబ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, కౌలు రైతులను యుద్ధ ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత రైతు – కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేటలోని కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి భవనంలో బుధవారం రైతు కూలీ సంఘం ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావంతో లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని, వేసిన పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వమే 388 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. అయితే కరువు ప్రాంత రైతులను, కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం మాత్రం ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు అర్నబ్ తుఫాన్ రైతులను మరింత కుదేలు చేస్తుందని అన్నారు. తుఫాన్ కారణంగా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు కురిసిన భారీ వర్షాలు కారణంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ముఖ్యంగా విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, బాపట్ల జిల్లాలు అతలాకుతలం అయ్యాయన్నారు. వరి, పత్తి, చెరుకు, అరటి, బొప్పాయి, మునగ వంటి పంటలు, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఈదురు గాలులకు కోత దశకు వచ్చిన వరి చేలు నేలనంటాయన్నారు. ప్రభుత్వమే తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, కౌలు రైతులను ఆదుకోవాలని, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ నాయకులు రెడ్డి శ్రీను, ఎన్.పోతురాజు, జూపూడి కృష్ణ, ప్రభుదాస్, జ్ఞానమ్మ, నరసింహారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


