రాష్ట్ర ఈగల్ విభాగం డీజీపీ ఆకే రవికృష్ణ
ఏఎన్‌యూ(పెదకాకాని): మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఈగల్ విభాగం డీజీపీ ఆకె రవికృష్ణ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ఆధ్వర్యంలో నూతన విద్యార్థుల కోసం ఓరియంటేషన్, ఇండక్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ టీం ఐజీపీ ఆకె రవికృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వినియోగం వలన వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరమన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ హెల్ప్‌లైన్ 1972 ద్వారా తెలియజేయాలన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ విశ్వవిద్యాలయంలోని విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశిష్ట అతిథి ఎస్.భరత్ కుమార్ మాట్లాడుతూ విద్య అనేది కేవలం డిగ్రీలు, మార్కులు సంపాదించడానికి మాత్రమే కాకుండా మానవత్వం, మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలను పెంపొందించడానికి ఉపయోగపడాలన్నారు. వర్సిటీ రెక్టార్ ఆర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని విద్యా వసతులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులతో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథి ఆకే రవికృష్ణ్ణ, విశిష్ట అతిథి ఎస్.భరత్ కుమార్‌లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రొఫెసర్ త్రిమూర్తి రావు, డాక్టర్ జ్యోతిర్మయి, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


