న్యూస్‌రీల్
బరిలో నుంచి
తప్పుకోవాలంటూ ఒత్తిళ్లు?
నిజాంపట్నంలోనూ రాజకీయ వేడి
మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
బెదిరింపులు..
ఓటమి భయంతో ప్రత్యర్థులపై ప్రలోభాల వల
రేపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేపల్లె నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌ల ఉపసంహరణ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు కూటమి నాయకులు ప్రలోభాలు, బెదిరింపులు, ఒత్తిళ్లు తెస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీని ఎదుర్కొని ప్రజల మద్దతు పొందాల్సిన చోట ప్రత్యర్థులను పోటీనుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు!
రేపల్లె మండలంలోని మోళ్ళగుంట ఎంపీటీసీ సెగ్మెంట్‌లో నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ఎంపీపీ అభ్యర్థికి సంబంధించిన రాజకీయ పోటీ నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లంకెవానిదిబ్బ, ఉప్పూడి ఎంపీటీసీ సెగ్మెంట్‌లలో, నగరం మండలం పెద్దవరం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రలోభాలతో పాటు బెదిరింపులు ఎదురవుతున్నాయి. చెరుకుపల్లి వైఎస్సార్ సీపీ జడ్పీటీసీ అభ్యర్ధికి భారీస్థాయిలో నజరానా ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినా అభ్యర్థి అంగీకరించకపోవటంతో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి పరీక్ష
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికకు కీలకమైనవి. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌లు దాఖలు చేయడం, ప్రచారం నిర్వహించడం, ఓటర్లను కలవడం ప్రజాస్వామ్యంలో కీలకమైన హక్కులు. ఈ హక్కులకు భంగం కలిగించేలా ప్రలోభాలు, బెదిరింపులు చోటుచేసుకుంటే ఎన్నికల స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎన్నికల నియమాలను పాటించాల్సిందే. రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో నామినేషన్‌ల ఉపసంహరణపై వస్తున్న ఆరోపణలను ఎన్నికల అధికారులు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు తెస్తున్నారంటూ అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించాల్సింది ప్రజలే తప్ప ప్రలోభాలు, బెదిరింపులు కాదనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.
నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలంటూ కొందరు కూటమి నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్‌లు ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే బదులు ప్రత్యర్థులను భయపెట్టి పోటీ నుంచి తప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు రాజకీయంగా వేడిని పెంచుతున్నాయి.
అధికారంలో ఉన్నామనే ధీమానే!
అధికారంలో ఉన్న తమకు అనుకూలంగా పరిస్థితులను మలచుకోగలమనే ధీమాతో కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధికారులు తమకు అనుకూలంగా ఉంటారని ఎన్నికల్లో ఓట్లను ఎలా మళ్లించాలో తమకు తెలుసంటూ వ్యాఖ్యానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికల నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిందే. ప్రత్యర్థి అభ్యర్థుల స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజాంపట్నం మండలంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, అభ్యర్థులపై ఒత్తిళ్ల అంశాలు చర్చకు వస్తున్నాయి. కూటమి నాయకుల ఒత్తిళ్ల కారణంగా 11 ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేసిన సెగ్మెంట్లలోనూ పోటీ నుంచి తప్పుకోవాలని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కూటమి నాయకులు అభ్యర్థులపై ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు కోరుతున్నాయి.


