‘అర్నాబ్‌’పై అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

‘అర్నాబ్‌’పై అప్రమత్తంగా ఉండండి

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

నేడు, రేపు పాఠశాలలకు సెలవు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌

బాపట్ల: జిల్లాలో ముంచుకొస్తున్న అర్నాబ్‌ తుఫాన్‌ కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం, కలెక్టరేట్‌ లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీర్చుకున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై కలెక్టర్‌ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 27, 28 తేదీలలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. అర్నాబ్‌ తుఫాన్‌ 28వ తేదీ బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. తీరం దాటేటప్పుడు ఆయా ప్రాంతాలలో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలియజేసిందని తెలిపారు. జిల్లాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తుఫాన్‌ ప్రభావంతో ముఖ్యంగా చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. అందుకు సంబంధించి విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మొదలగు విద్యుత్‌ పరికరాలను, సిబ్బందిని సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి స్థానికంగా జరిగిన సంఘటనలను, పరిస్థితులను పర్యవేక్షిస్తారని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలోని పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో గర్భిణుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచనలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈ వారంలో ప్రసవం అయ్యే వారు పి.హెచ్‌.సి, సి.హెచ్‌ సి, ఏరియా లేదా జిల్లా ఆసుపత్రుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. తుఫాన్‌ ప్రభావం తగ్గేవరకు సముద్ర తీరప్రాంతాల్లో పర్యాటకులకు అనుమతులు లేవన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, అధికారులు పాల్గొన్నారు.

తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి

బాపట్ల: జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ లోని న్యూ వీసీ హాల్‌లో జిల్లాలో రాబోవు తుఫాన్‌ వల్ల జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవలసిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను, అదేవిధంగా కష్ణానది తీరాన ఉన్న గ్రామాలు, కెనాల్‌ సమీపంలో ఉన్న ముంపు గ్రామ ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా ముందుగానే వారికి తెలియజేయాలని, ఇప్పటికే సముద్రంలోనికి వెళ్లిన మత్స్యకారులను తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ డీడీని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీటికి, భోజనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలన్నారు. పూరిళ్లు, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, డీఎఫ్‌ఓ సౌజన్య, జెడ్పీ సీఈఓ సి హెచ్‌ విజయలక్ష్మి, బాపట్ల ఆర్డీఓ ఏ.హరి కుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. విజయమ్మ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మావతి, డీఈఓ శ్రీనివాస్‌ సింగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.లక్ష్మి పాల్గొన్నారు.

నిజాంపట్నం (రేపల్లె): తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో మంగళ, బుధవారాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం నిజాంపట్నం మండలం హారీస్‌పేట పంచాయతీలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఆయన, తుపాను పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అంగనన్‌వాడీ చిన్నారులకు రెండు రోజులకు సరిపడా సరుకులను ముందుగానే అందించి కేంద్రాలకు సెలవులు ప్రకటించాలన్నారు. తుపాను హెచ్చరికలు వీడేంత వరకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. తీరప్రాంత గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. ఆయనవెంట ఆర్డీఓ బూసి శ్రీదేవి, పలు శాఖల అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement