బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత | - | Sakshi
Sakshi News home page

బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

బాపట్ల: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి అర్నాబ్‌ తుఫాన్‌గా మారి న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ సూచించారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న బీచ్‌లను తాత్కాలికంగా మూసివేసినట్లు, అక్టోబర్‌ 27 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రజలు, పర్యాటకులు, సందర్శకులకు సముద్ర తీర ప్రాంతాల్లోకి అనుమతి లేదని ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. తుఫాన్‌ ప్రభావం బాపట్ల జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పోలీస్‌, రెవెన్యూ అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రాంతాలకు, తుఫాన్‌ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఎస్పీ తెలిపారు. మత్స్యకారులు తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. వరద నీటితో పొంగిపొర్లే కల్వర్టులు, వాగులు, వంకలు, నదులను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలను హెచ్చరించారు. అక్టోబర్‌ 27, 28 తేదీలలో తుఫాన్‌ ప్రభావం జిల్లా పై అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా ఇతర సందర్భాలలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో, వాగులు వంకలలో వరద ప్రవాహం ఉధతంగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బాయ్‌లు, తాళ్లు వంటి రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు, పోలీస్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్‌ సహాయం కోసం డయల్‌ 112 లేదా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 8333813228కు ఫోన్‌ చేయాలని, స్థానిక పోలీస్‌ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement