జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో మద్యం దుకాణాలలో ఈనెల 30 సాయంత్రం 5 గంటల నుంచి విక్రయాలు నిలుపుదల చేస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం తెలిపారు. ఈ రెండు ప్రాంతాల పరిధిలో స్థానిక సంస్థల పోలింగ్ నవంబరు 1న జరుగుతున్నందున నిబంధనల మేరకు విక్రయాలు నిలుపుదల చేస్తున్నామన్నారు. నవంబరు 3వ తేదీన కౌంటింగ్ ఉన్నందున, 48 గంటల ముందు నుంచి మద్యం విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నిబంధనలు, సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఐదు మండలాల్లో వర్షం
పెదకాకానిలో 24.6 మి.మీ. నమోదు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఐదు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెదకాకాని మండలంలో 24.6 మిల్లీ మీటర్లు, గుంటూరు పశ్చిమ 13.1, మంగళగిరి 12, తాడేపల్లి 2.6, గుంటూరు తూర్పులో 2.4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. నవంబర్ 26వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 102.3 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 34.3 మి.మి వర్షపాతం మాత్రమే నమోదైంది.
రోడ్డు ప్రమాదంలో
మహిళ మృతి
చేబ్రోలు: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. చేబ్రోలు ఎస్‌ఐ పి.వీరనారాయణ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారా కోడూరు నవీన హోటల్ జీబీసీ రహదారిపై ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో రోడ్డు పక్కన వాటర్ బాటిల్ పట్టుకొని నడుచుకొంటూ గుంటూరు వైపు వెళ్తున్న మహిళను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళ తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందింది. రోడ్డు పక్కన వెళ్తున్న మహిళను రాత్రి సమయంలో గుర్తించిన కారు డ్రైవర్ ఆకస్మికంగా పక్కకు వెళ్లాడు. కారు వెనుక వస్తున్న ఆటో మహిళను గుర్తించిక పోవటంతో ఢీ కొట్టాడు. వైద్యశాలకు తరలించగా అక్కడ మరణించింది. మృతురాలి ఆచూకీ కోసం గాలించినప్పటికి లభ్యం కాలేదు. మృతురాలి గురించి వివరాలు తెలిసిన వారు వెంటనే చేబ్రోలు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.
పెదకాకాని: వీవీఐటీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణ ద్రష్ట స్టూడెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం ప్రయుక్తి 2ఓ26 క్యాంపస్‌లో ఘనంగా ప్రారంభమైంది. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తొలిరోజు సోమవారం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ వీవీఎస్ స్ట్రక్టెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంజినీర్ పి.విష్ణు సాయి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో వీవీఐటీయూ ప్రో–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జున రెడ్డి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సయ్యద్ ఫరూక్ అహ్మద్, కార్యక్రమ సమన్వయకర్త(కన్వీనర్) డి.జయకృష్ణ పాల్గొన్నారు.


