ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బంగారం, నగదు అపహరణపై ఫిర్యాదు పార్థివదేహాన్ని దానం చేసిన కుటుంబ సభ్యులు పెళ్లి ఇంట విషాదం బంగారం చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లా పరిషత్‌ (బాలురు) ఉన్నత పాఠశాలలో 52వ రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలబాలికల కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ప్రధానోపాధ్యాయుడు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ సామా సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోటీలను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.వి.ప్రభావతి, సెక్రటరీ వై.శ్రీకాంత్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యన్‌.అర్జునరావు, ట్రెజరర్‌ యం.సుబ్బరాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని 28 జిల్లాల జూనియర్‌ బాల బాలికల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.దామోదర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వై సీనయ్య, శంకర్‌, చెంచయ్య నాయుడు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, జాహ్నవి ప్రియ, కె.ఓబులేసు పాల్గొన్నారు.

అమృతలూరు(వేమూరు): ఇంటిలో బంగారం, నగదు పోయిందని బాధితులు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు. పోలీసులు కథనం మేరకు.. అమృతలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన కుర్రా పున్నారావు, బంగారం వస్తువులు, రూ.5 లక్షల నగదు ఇంటిలో పెట్టి హుబ్లీ వెళ్లారు. హుబ్లీ నుంచి తిరిగి వచ్చేక బంగారం వస్తువులు, నగదు కనిపించడం లేదని శుక్రవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంకొల్లు(చినగంజాం): కోలలపూడి గ్రామానికి చెందిన పొన్నం అన్నపూర్ణమ్మ (88) గురువారం మృతి చెందడంతో ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంకొల్లు అవయవదాన కమిటీకి దానం చేశారు. గుంటూరు కాటూరి మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులకు ఉపయోగ పడేందుకు కుటుంబ సభ్యులు స్వయంగా పూర్తి అంగీకారంతో ఇచ్చేశారు. మృతురాలి నేత్రాలను దానం చేసి ఇరువురు వ్యక్తులకు చూపును ఇచ్చేందుకు, దేహాన్ని దానం చేయడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడనుందని రోటరీ సభ్యులు అన్నారు. కుటుంబ సభ్యులు కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు అన్నపూర్ణ, కనుమూరి మురళి, శారద, యరమాసు నిర్మలను ఇంకొల్లు రోటరీ క్లబ్‌ సభ్యులు సోమేపల్లి రామ్మోహనరావు, జెట్టి వెంకటేశ్వర్లు, అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్‌ అలవల రాఘవరెడ్డి, గోరంట్ల నాగేశ్వరరావు, కిషోర్‌లకు కృతజ్ఞతలుతో పాటు అభినందనలు తెలియజేశారు.

వధువు తండ్రి అనారోగ్యంతో మృతి

దుగ్గిరాల: శుభకార్యాక్రమం జరగాల్సిన ఇంట విషాదం చోటుచేసుకుంది. ఇంటి యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివరాలు.. మండలం చిలువూరుకు చెందిన నెమలికంటి మరియదాసు(55), ఎండీ అఖిల బేగం భార్యాభర్తలు. వీరికి కుమారుడు కృపానిధి, కుమార్తె మహిమ ఉన్నారు. కుమార్తెకు 17వ తేదీ వివాహానికి నిశ్చతార్థం చేసుకున్నారు. గత ఆదివారం సాయంత్రం అధిక రక్తపోటు గురికావడంతో మంగళగిరిలోని ఎయిమ్స్‌కు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శనివారం కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా మృతి చెందడంతో గ్రామం విషాదఛాయలు అలుముకున్నాయి. మరియదాసు వైఎస్సార్‌ సీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉండేవారు. ఆయన మృతికి పార్టీ నేతలు నివాళులర్పించారు.

పెదనందిపాడు: తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి బంగారం చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ప్రత్తిపాడు సీఐ పి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పెదనందిపాడు పోలీస్‌స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పెదనందిపాడుకు చెందిన బెల్లం శ్రీనివాసరావు ఇంట్లో ఎవరు లేని సమయంలో అదే గ్రామానికి చెందిన జరుగుల లోకేష్‌ బంగారం అపహరించినట్లు ఫిర్యాదు చేశారని, లోకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శుక్రవారం ఉదయం నల్లమడ వాగు వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న లోకేష్‌ అదుపులోకి తీసుకొని విచారించగా బెల్లం శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం చేసిన విషయం అంగీకరించాడని చెప్పారు. నిందితుని వద్ద నుంచి సుమారు రూ.6,50,000 విలువైన 68 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని, నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఎస్‌ఐ ఏక్‌నాధ్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement