ఇదేం ధరయ్యో..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం ధరయ్యో..!

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

ఇదేం ధరయ్యో..! ప్రభుత్వ వైఫల్యం.. ప్రజలకు శాపం

ధరలపై నియంత్రణ ఏదీ ?

నిత్యావసరాల ధరాఘాతంతో సామాన్యుడు విలవిల సలసల కాగుతున్న వంటనూనెలు.. ఘాటెక్కిన ఉల్లిపాయ చేదెక్కిన పంచదార.. బెల్లం బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు ౖపైపెకి.. తలకిందులవుతున్న కుటుంబ బడ్జెట్లు నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అర్ధాకలితో అలమటిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు

ధరలు తగ్గించాలి..

ధర చూస్తే ‘ఉల్లి’క్కిపాటు

ధరల నియంత్రణపై పర్యవేక్షణ ఏదీ..?

నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాల్సిన యంత్రాంగం ఉన్నా మార్కెట్‌లో ధరల పెరుగుదల కొనసాగుతుండటం ఆందోళనగా ఉంది. అటు కూరగాయలు, ఇటు నిత్యావసర వస్తువులు రెండూ హద్దుల్లేకుండా పెరిగిపోతున్నాయి. రూ.100 జేబులో వేసుకుని కూరగాయల మార్కెట్‌కు వెళ్తే ఒక రకం కూరగాయలు మాత్రమే వస్తున్నాయి. జీవనం కష్టతరమవుతోంది. ఇలా అయితే రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి తిండితినలేని పరిస్థితి వస్తుంది.

–తూము వెంకటేశ్వర్లు,

అమరావతి రోడ్డు, గుంటూరు

కొరిటెపాడు(గుంటూరు): నిత్యావసర సరుకుల ధర లు కొండెక్కాయి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. రెండేళ్లలోనే ఏకంగా 50 నుంచి 100 శాతానికి ధరలు పెరిగిపోయాయి. బియ్యం ధరలు 26 కిలోల బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు పెరిగాయి. చివరకు పచ్చడి చేసుకుని తిందామనుకున్నా ఆ పరిస్థితి లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేయడానికి చేతిలో పనులు లేవుగానీ పీకలదాకా తాగేందుకు మద్యం ఒక్కటే పుష్కలంగా దొరుకుతోంది.

సామాన్యుడిపై ధరాఘాతం

నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆదాయం పెరగకపోయినా.. ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. బియ్యం, పప్పులు, వంటనూనెలు, ఉల్లిపాయలు, కూరగాయలు ఇలా వంటింటికి అవసరమైన ప్రతి వస్తువు ధరలోనూ పెరుగుదల కనిపిస్తోంది.

బియ్యం ధరలకు రెక్కలు

రైతుల నుంచి ధాన్యం నిల్వలు మొత్తం వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. దీంతో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 2024వ సంవత్సరం ఏప్రిల్‌లో సోనా మసూరి బియ్యం కిలో ధర రూ.40 నుంచి రూ.42 మధ్య పలికింది. కొన్ని ప్రాంతాల్లో రూ.45 వరకు విక్రయించారు. ప్రస్తుతం బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో బియ్యం కొనాలంటే రూ.70 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్లలో కిలో సన్న బియ్యం రూ.52 చొప్పున విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ ప్రకటించినా అన్ని చోట్లా అమలు కావడంలేదు.

మంట పుట్టిస్తున్న వంట నూనె

వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. ప్యాకెట్‌ నూనెలే కాకుండా గానుగ ఆడిన స్వచ్ఛమైన వేరుశనగ నూనె కేజీ రూ.260 నుంచి రూ.290 వరకు పలుకుతోంది. సాధారణ పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.145, వేరుశనగ నూనె ప్యాకెట్‌ రూ.185 నుంచి రూ.190 వరకు ఉంది. ఇక పప్పు ధాన్యాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. నిత్యం వాడే కందిపప్పు కేజీ రూ.200 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. మినప గుళ్లు రూ.160లు, వేరుశనగ గుళ్లు రూ.180లకు చేరింది. ఎండుమిర్చి ధర అమాంతం పెరిగి కేజీ రూ.300 నుంచి రూ.350 వరకు వెచ్చించాల్సి వస్తోంది. పంచదార ధర రూ.75 నుంచి రూ.80 వరకు చేరింది.

పట్టించుకోని ప్రభుత్వం

ధరల పెరుగుదల భారీగా ఉన్నా, సామాన్యులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజానీకం మండిపడుతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన పాలకులు చోద్యం చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిత్యావసరాల ధరలను అదుపు చేసేందుకు యత్నించకపోవడంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

సాధారణంగా ప్రతి వంటలోనూ ఉల్లిపాయలు తప్పనిసరి. పెరిగిన ధరలతో ఉల్లి వాడకం మానుకోవాల్సి వచ్చిందని, రెండు మూడు పాయలు వాడాల్సిన కూరలో ఒకటీ అర వాడి సరిపెడుతున్నామని మహిళలు వాపోతున్నారు. 2024వ సంవత్సరంలో కిలో ఉల్లిపాయల ధర రూ.15 నుంచి రూ.18 మధ్య ఉండేది. నేడు అమాంతం పెరిగి రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది.

హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి రిటైల్‌ దుకాణం వరకు ధరల్లో తేడాలు ఎందుకు వస్తున్నాయో అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక లాభాల కోసం ధరలు పెంచడం, అక్రమ నిల్వలు వంటి అంశాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. నిత్యావసరాల ధరలు సామాన్యులపై మోయలేని భారంగా మారకుండా రైతుబజార్లు, చౌక ధరల దుకాణాల ద్వారా అవసరమైన సరుకులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. మార్కెట్‌లో ధరలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.

గత రెండు, మూడు నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలకు అయితే అడ్డూ అదుపులేదు. వంట నూనెలు, ఉల్లిపాయలు, కందిపప్పు, కూరగాయలు కొనలేని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ధరలను నియంత్రించాలి.

–దారం ఈశ్వరమ్మ, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement