రెచ్చిపోతున్న ఇసుకాసురులు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

అరవింద వారధి పునాదుల చెంతే ఇసుక అక్రమ తవ్వకాలు వారధి మనుగడ ప్రశ్నార్ధకంగా మారేలా చర్యలు ఆందోళనలో పది లంక గ్రామాల ప్రజలు

కొల్లూరు: అరవింద వారధి మనుగడకు ముప్పు వాటిల్లేలా ఇసుక అక్రమ తవ్వకాలు మితిమీరాయి. కృష్ణా నదిపై మండలంలోని పెసర్లంక – పెదలంక నడుమ మూడు జిల్లాలకు చెందిన 10 లంక గ్రామాల ప్రజల రాకపోకలు, వ్యవసాయోత్పత్తుల తరలింపునకు నిర్మించిన అరవింద వారధి మనుగడే ప్రశ్నార్ధకంగా మారేలా పునాదుల చెంతనే ఇసుకాసురులు బరితెగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కృష్ణానదికి శుక్రవారం ఎగువ నుంచి నీరు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని పెదలంక నదీ అంచుల వెంబడి వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. నదిలో నీరు ఉండటంతో పెదలంక వైపు అరవింద వారధి కింద ఉన్న ఇసుక దిబ్బలపై అక్రమార్కుల కన్ను పడింది. అరవింద వారధి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారధికి ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న నిబంధనను ఇసుకాసురులు కాలరాసి ప్రమాదానికి బాటలు వేస్తున్నారు. వారధి పునాదుల వద్ద చేపడుతున్న ఇసుక తవ్వకాల ఫలితంగా వరదల తీవ్రత అధికమైన సమయంలో పిల్లర్లు బలహీనపడి వారధి మనుగడే ప్రశ్నార్ధకంగా మారనుంది. వారధి భవితవ్యానికి ముప్పు వాటిల్లిన పక్షంలో బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పెదలంక, చింతర్లంక, ఈపూరులంక, కొత్త ఈపూరులంక, సుగ్గునలంక, చిలుమూరులంక, అన్నవరపులంక, కొత్తూరులంక, కనిగిరిలంక, మునగపల్లిలంక గ్రామాల ప్రజలకు రవాణా మార్గం లేకుండా పోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement