నరసరావుపేటఈస్ట్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఫెడరేషన్ పిలుపులో భాగంగా ఈనెల 29వ తేదీ మంగళవారం నరసరావుపేట స్టేషన్‌రోడ్డులోని గాంధీ పార్క్ ధర్నా పాయింట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మానం సుబ్బారావు, కార్యదర్శి సి.సి.ఆదెయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహాధర్నాలో పల్నాడు జిల్లాలోని 8 యూనిట్‌ల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పెన్షన్ రూల్స్– 2025ను రద్దు చేయాలనీ, 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్ సవరణ, మధ్యంతర భృతి, 50 శాతం డీఏ, డీఆర్‌ను మూల వేతనం పెన్షన్‌లో విలీనం వంటి 12 డిమాండ్ల సాధన కోసం మహాధర్నా చేపడుతున్నట్టు వివరించారు. ధర్నాలో పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
రాజుపాలెం: ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని అనుపాలెం సెంటర్‌లో సోమవారం చోటుచేసుకుంది. అనుపాలేనికి చెందిన యక్కంటి బాబు, భార్య హేమ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దపాప యక్కంటి నిచ్చిత(7)ను పిడుగురాళ్లలోని మాంటిస్సోరీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఈ ఏడాది ఎల్‌కేజీలో చేర్పించారు. రోజు అదే పాఠశాలకు చెందిన బస్సులో వెళ్లి వస్తుంటుది. రోజులాగనే సోమవారం కూడా పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం పాఠశాల నుంచి అదే బస్సులో అనుపాలెం సెంటర్‌కు చేరుకోగానే బ్యాగ్ కింద పడిందని దూకింది. ఆ సమయంలో బస్సు వెనుక చక్రాల కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విజయవాడలీగల్: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో లభ్యమైన మహిళ మొండేనికి సంబంధించిన కేసులో నిందితులకు వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ 5వ అదనపు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వివరాలు.. ఈనెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ పంప్‌హౌస్ వద్ద కూలింగ్ కెనాల్‌లో మహిళ మొండెం తేలుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ డీసీపీ గుణ్ణం రామకృష్ణ, పశ్చిమ డివిజన్ ఏసీపీ ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి డ్రోన్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సాయంతో కెనాల్‌లోని శరీర భాగాలను వెలికితీశారు.
టాటూ ఆధారంగా..
అనంతరం మృతదేహం చేతిపై ఉన్న నెమలి పించెం టాటూ ఆధారంగా మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ప్రచారం చేయగా, మృతురాలు ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్న తాడినాడకు చెందిన కర్రి దుర్గా కల్యాణి (29)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం మంగళగిరిలో నివసిస్తోంది. విచారణలో దుర్గ కల్యాణి ఒక హోటల్ యజమానితో సహజీవనం చేయగా బాబుకు జన్మనిచ్చి, ఆ బాబును భవానీపురం హెచ్.బి.కాలనీకి చెందిన మాంసం వ్యాపారి షేక్ షఫీ (46)కి దత్తత ఇచ్చింది. ప్రతిసారి డబ్బులు కావాలని వేధించడంతోపాటు బాబు విషయంలో గొడవలతో షఫీ ఈనెల 17న ఆమెను ఇంటికి పిలిచి, మటన్ కత్తితో హత్య చేశాడు. దీనికి అతని స్నేహితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ దుర్గారావు సహాయం తీసుకొని, మృతదేహాన్ని ముక్కలు చేసి తుమ్మలపాలెం, గొల్లపూడి కూలింగ్ కెనాల్‌లో పడేశాడు. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కేపీహెచ్‌బీకాలనీ: మాయమాటలు చెప్పి బాలికను గర్భణిని చేసిన ఓ యువకుడిపై కేపీహెచ్‌బీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఏడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో నగరానికి వలస వచ్చి కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తోంది. ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుమార్తె, కుమారుడిని చదివిస్తోంది. కుమార్తె(17) కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇటీవల తమ సమీప గ్రామానికి చెందిన వెంకట్ చందు(21) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు పరిచయమయ్యాడు. చందు అమీర్‌పేటలో నివసిస్తూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పరిచయం పెరిగి బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో తరచూ కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమె గర్భిణి అయింది. వెంకట్ చందు గర్భ నిరోధక మాత్రలు ఇవ్వడంతో గర్భ విచ్చిత్తి జరిగింది. ఇటీవల బాలిక మళ్లీ గర్భం దాల్చి తరచూ కడుపు నొప్పి అంటుండటంతో తల్లి గట్టిగా నిలదీసింది. విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయిన తల్లి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు వెంకట్ చందుపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా కేసు నమోదు నాటికి ఆ బాధితురాలి వయస్సు 18 సంవత్సరాలు అయినప్పటికీ ఆరు నెలల గర్భం దాల్చటంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు రూరల్: రైతునేస్తం పురస్కారాలకు అక్టోబర్ 31లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్, రైతులు రైతునేస్తం వెబ్‌సైట్ హెచ్‌టీటీపీ://రైతునేస్తం.ఇన్/అవార్డ్స్ నుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి అక్టోబర్ 31వ తేదీలోగా ఎడిటర్, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004. ఫోన్ నంబర్ 9676797777 (లేదా) రైతునేస్తం డోర్ నంబర్ 8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ 522017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపగలరని తెలిపారు. లేదా ఎడిటల్‌ఃరైతునేస్తం.ఇన్‌కు ఇ–మెయిల్ చేయవచ్చని తెలిపారు.


