జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట
బాపట్ల: ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 180 అర్జీలు అందినట్లు జేసీ తెలిపారు. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతోపాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని, అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారుల లవన్న, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి విజయమ్మ, జిల్లా అటవీ అధికారి సౌజన్య, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారిగా డాక్టర్ మక్కెన పద్మావతిని నియమిస్తూ సోమవారం డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో గుంటూరు గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో సివిల్ సర్జర్ ఆర్‌ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పద్మావతిని ఫుల్ అడిషనల్ చార్జ్(ఎఫ్‌ఏసీ) డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


