గుంటూరు మెడికల్: పెద్ద ఎత్తున నిర్మాణాలు, అపార్టుమెంట్‌లు, టౌన్‌షిప్‌లు చేపట్టే సమయంలో పర్యావరణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం అన్నారు. సోమవారం పలు భవన నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈఐఏ నోటిఫికేషన్ 2006 ప్రకారం 20 వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ, 1.50 లక్షల చదరపు మీటర్ల కంటే తక్కువ నిర్మిత విస్తీర్ణం కలిగిన బిల్డింగ్, ప్రాజెక్టులు 8ఏ కేటగిరికి వస్తాయని వివరించారు. ఇలాంటి ప్రాజెక్టులను సంబంధిత నిబంధనల ప్రకారం ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్(ఈసీ) తీసుకోవాలని చెప్పారు. ఈసీ అనుమతిని స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇన్‌ప్యాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ ఏపీ ద్వారా జారీ చేస్తారని వెల్లడించారు. పర్యావరణ అనుమతి పొందిన అనంతరం సంబంధిత నిర్మాణ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సంట్ టూ ఎస్టాబ్లీష్ (సీటీఈ), కన్సంట్ టూ ఆపరేట్(సీఈఓ) అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రజలు, ప్లాట్ లేదా ఇంటినే కొనుగోలు చేసే సమయంలో సంబంధిత నిర్మాణ సంస్థకు అవసరమైన ఈసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకనుగుణంగా నిర్మాణం జరుగుతుందా లేదా అనే విషయాలను నిర్ధారించుకున్న తరువాతే ప్లాట్, ఇల్లు కొనుగోలు చేయడం మంచిదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అన్ని అనుమతులు పరిశీలించిన తరువాతే పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
గుంటూరు మెడికల్: రాహుల్‌గాంధీ తప్పుడు విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ విమర్శించారు. చంద్రమౌళి నగర్‌లోని పారీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ విమర్శలు సరికాదన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలపాటి రవికుమార్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: వయోజన బీసీజీ వ్యాక్సిన్‌పై అధ్యయనం చేసేందుకు సోమవారం గోరంట్ల ప్రభుత్వ ఛాతి, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రిని ఐసీఎంఆర్, ఎన్‌ఐఆర్‌టీ బృందం సందర్శించింది. టీబీ సోకే ప్రమాదం ఉన్నవారిలో 60 సంవత్సరాలు పైబడిన వారు, షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు, గతంలో టీబీ వచ్చి తగ్గిన వారు, బీఎంఐ (బాడీమాస్క్‌ఇండెస్క్) 18 కేజీల కన్న తక్కువగా ఉన్నవారిని ఆరు కేటగిరిలకు సంబంధించిన వ్యక్తులకు 2019–24 మధ్య కాలంలో బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం క్షయ వ్యాధి నివారణలో వయోజన బీసీజీ వ్యాక్సిన్ ప్రభావం, నియంత్రణకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆసుపత్రికి వచ్చిన ఐసీఎంఆర్ వైద్య బృందం పలు మార్గదర్శకాలు ఆసుపత్రికి వైద్యులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని జ్వరాల ఆసుపత్రిలో ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకంటి రఘు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ త్రివేణిలు ఐసీఎంఆర్ బృందానికి అడిగిన సమాచారాన్ని అందజేశారు. కార్యక్రమంలో సైంటిస్ట్ డాక్టర్ సాయిరామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరజ్, ఎపిడిమాలజిస్ట్ శశికాంత్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద ఓ కారు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్‌హెచ్–16 రహదారిపై కోడూరుపాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుంటూరు నుంచి తణుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. కారు డ్రైవర్ ఎస్.మోహన్ వరుణ్, ప్రయాణికులు చిట్టూరి గణేష్, అతని భార్య పూజిత సురక్షితంగా బయటపడ్డారు. వీరవల్లి పోలీసులు, హనుమాన్‌జంక్షన్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.


