బాపట్ల టౌన్: జిల్లాలోని 40 వైన్ షాపులకు ఈనెల 24 నుంచి టెండర్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ డా. సీహెచ్ నరేష్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... బాపట్ల జిల్లాతోపాటు అద్దంకి పరిధిలోని షాపులతో కలిపి మొత్తం 40 షాపులకు రెన్యువల్ జరగలేదని చెప్పారు. వీటన్నింటికీ టెండర్లు ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఒక్కో షాపునకు సుమారు 10 టెండర్లు వేయాలని, ఒక్కొక్కరు రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలని తెలిపారు. టెండర్ రాకపోతే డిపాజిట్ చేసిన డబ్బులను ప్రభుత్వం తిరిగి ఇవ్వదనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు టెండర్లను స్వీకరిస్తామన్నారు. బాపట్ల పట్టణంలో 2, బాపట్ల రూరల్ – 2, కర్లపాలెంలో 1, రేపల్లె పట్టణంలో 1, రేపల్లె రూరల్‌లో 3, భట్టిప్రోలులో 3, అమృతలూరులో 1, చుండూరులో 1, కొల్లూరులో 3, నగరంలో 2, నిజాంపట్నంలో 1, చీరాల పట్టణంలో 6, వేటపాలెంలో 1, కారంచేడులో 2, పర్చూరులో 4, అద్దంకి రూరల్‌లో 2, కొరిసపాడులో 1, సంతమాగులూరులో 1, బల్లికురవలో 1 షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటలకు సమయం ముగుస్తుందని చెప్పారు. మూడో తేదీన పరిశీలన జరుగుతుందని, 5వ తేదీన ఆరు షాపులకు ప్రకాశం జిల్లా కలెక్టర్, 34 షాపులకు బాపట్ల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నట్లు తెలిపారు.


