ముఖ్యఅతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్ హాజరు టోర్నీ విజేత హరి సూర్యనారాయణ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేత
మంగళగిరి టౌన్: మంగళగిరి టిప్పర్ల బజారులోని అంజుమన్ షాదీఖానాలో గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధి ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటు–2026 ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 220 మంది క్రీడాకారులు హాజరవడం విశేషం. ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున గుంటూరు జిల్లా చెస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ సహకారంతో ఎన్‌ఆర్‌ఎం చెస్ అకాడమీ ఈ టోర్నమెంట్ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్ హాజరవడమేకాకుండా టోర్నమెంట్‌లో పాల్గొనగా... టోర్నమెంట్ డైరెక్టర్లు నందం రామ్మోహనరావు, కోవిలకారు శివరామ్ బాబాజీ (కృష్ణ), కోచ్ ఎస్ కె.ఖాసిం, సీనియర్ ప్లేయర్ జి.ప్రసాద్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ జీవీ కుమార్ పాల్గొన్నారు. తొలి ఎత్తు శాస్త్రి బామ్ యాజమాన్య ప్రతినిధి రామనాథం వీరభద్రరావు, కోనేరు అశోక్ లు వేసి పోటీలను ప్రారంభించారు. మొత్తం ఏడు రౌండ్లలో పోటీలు జరగ్గా... ముగ్గురు ప్లేయర్స్ కి 6.5 వంతున పాయింట్లు రాగా ఈ టోర్నమెంట్ లో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రథమ స్థానం గుంటూరుకు చెందిన ఎ.హరిసూర్యనారాయణ సాధించగా, ద్వితీయస్థానం గుంటూరుకు చెందిన చిన్నం వైష్ణవి, తృతీయ స్థానం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తాళ్ల నిశ్చల్ పొందారు. బహుమతి ప్రదానోత్సవానికి అతిథులుగా మంగళగిరి రోటరీ క్లబ్ తరఫున రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాసరావు, కోశాధికారి చనుమోలు గోపాల్, శాస్త్రి బామ్ ప్రతినిధి రామనాథం వీరభద్రరావు, జక్కా నాగ వెంకట గోపాలరావులు హాజరయ్యారు. ప్రథమ బహుమతి రూ.6,100 నగదు, ట్రోఫీ, ద్వితీయ బహుమతి రూ.4,100 నగదు, ట్రోఫీ, తృతీయ బహుమతి రూ.3,100, ట్రోఫీ ఇతర బహుమతులు అందజేశారు. మంగళగిరి రోటరీ క్లబ్, శాస్త్రిబామ్, కోదండరామ ఆయుర్వేదిక్ నిలయం యూవీకే రామమోహనరావు, జక్కా నాగ వెంకట గోపాలరావు, పాండురంగా హార్డ్ వేర్ అండ్ ప్లేవుడ్, రవితేజ ట్రేడర్స్ సంయుక్తంగా ఐదు జిల్లాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌కు స్పాన్సర్స్ గా వ్యవహరించాయి. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆర్బిటర్లను నిర్వాహకులు సత్కరించారు.


