ప్రత్తిపాడు: ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు గాయాలపాలైన ఘటన పాత మద్రాస్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలి పిన ప్రకారం ప్రత్తిపాడు నుంచి ప్రయాణీకులను ఎక్కించుకుని గుంటూరు వెళ్తున్న సర్వీస్ ఆటో గుంటూరు–పర్చూరు ఓల్డ్ మద్రాస్ రోడ్డులో ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం సమీపంలో అదుపుతప్పి పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంకు చెందిన షేక్ జాన్ వలి, ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంకు చెందిన కొమ్మిశెట్టి అంజయ్య, కొండేపాడుకు చెందిన దాసరి జక్రయ్య , ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నరుగా పని చేస్తున్న మట్టుపల్లి సునీతలతో పాటు ఆటో నడుపుతున్న వంగిపురం గ్రామానికి చెందిన కె.కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కాలువలోని ముళ్ల పొదల్లో పాడి ఉన్న క్షతగాత్రులను108 ఈఎంటీలు తీవ్రంగా శ్రమించి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కాగా వీరిలో సునీత, అంజయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి.


