ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేడా హనుమంతరావు డిమాండ్
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులందరూ కలిసికట్టుగా పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేడ హనుమంతరావు పేర్కొన్నారు. ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు భూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. హనుమంతరావు మాట్లాడుతూ నిత్యావసరాలు అధిక ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా పాటించకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని చెప్పారు. దేశ సంపదని ఆదాని, అంబానీలకి తాకట్టు పెడుతూ రూ.16లక్షల కోట్లు బ్యాంకుల రుణాలను మాఫీ చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పని గంటల దినాన్ని తగ్గించాలని, జీతాలు సక్రమమైన పద్ధతుల ఇవ్వాలని, స్కీంవర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని, అసంఘటిత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని, 12వ పీఆర్‌సీ తక్షణ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, లేనియెడల కార్మికులు, కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాల సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, సీహెచ్.సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.


