రాయితీ డల్‌! | - | Sakshi
Sakshi News home page

రాయితీ డల్‌!

Sep 21 2026 6:29 AM | Updated on Sep 21 2026 6:29 AM

రాయితీ డల్‌!

నెలన్నర కిందట సబ్సిడీ విక్రయ కేంద్రాలు ప్రారంభం తక్కువ ధరకే ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హడావుడి కేంద్రాల నిర్వహణ బాధ్యత రైస్‌ మిల్లర్లకు అప్పగింత బియ్యం సరఫరాకు తగిన చర్యలు చేపట్టని పాలకులు బహిరంగ మార్కెట్లో ధరలు పెరగడంతో సామాన్యులు విలవిల

బియ్యం ధర హడల్‌..
మూడు నెలలుగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అడ్డుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగా.. వ్యాపారులు ఇదే అదునుగా దోపిడీకి తెరతీశారు. ఈ క్రమంలో సర్కారు ఆదేశాల మేరకు సన్న బియ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గత నెల 5న జిల్లాలో రైతు బజారుల్లో 25 సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యేలు ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ ప్రస్తుతం ఇవి నామమాత్రంగా మారిపోయాయి.

సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని పదేపదే నిరూపితమవుతోంది. బియ్యం, నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సబ్సిడీపై సన్నబియ్యం అందిస్తామని ఆశ చూపిస్తూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ సన్న బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల్లో విక్రయాలు మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి.

పేరుకే 25 విక్రయ కేంద్రాలు...

జిల్లాలోని రైతు బజారుల్లో 25 సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాలను గత నెల 5న ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రారంభించారు. బియ్యం విక్రయ కేంద్రాల నిర్వహణను మిల్లర్ల సంఘాలకు అప్పగించారు. మిల్లర్ల సంఘాలు ఈ నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించినప్పటికీ, పౌరసరఫరాల సంస్థ, ఆ శాఖ అధికారులను రంగంలోకి దించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లు అంగీకరించారు. బయట కొనుగోలు చేసిన పలు రకాల బియ్యం బస్తాలను కొంత మొత్తంలో సబ్సిడీ విక్రయ కేంద్రాలకు తీసుకువచ్చి తూతూమంత్రంగా విక్రయాలు జరుపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాణ్యత లేని బియ్యం...

ఇటీవల కాలంలో నాలుగు దఫాలుగా బియ్యం ధరలు పెరిగాయి. గత కొంతకాలంగా పేద, మధ్యతరగతి ప్రజలు బియ్యం ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల క్రితం రూ.40 నుంచి రూ.50కు లభించే కిలో బీపీటీ బియ్యం నేడు దఫదఫాలుగా పెరిగి రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. ఈ లెక్కన బియ్యం కొనుగోలు చేసి తాము రూ.52కే ఇవ్వడం, పైగా విక్రయ కేంద్రాన్ని నిర్వహించడం ఎలా సాధ్యమని మిల్లర్లు మదనపడుతున్నారు. దీంతో అందుబాటులో లేకుండా ముఖం చాటేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. సాయంత్రం 5 గంటలైతే మూతపడుతున్నాయి. వీలు చేసుకుని పనులకు వెళ్లే పేద కూలీలు సబ్సిడీ బియ్యం కోసం వస్తే ఆధార్‌ కార్డు, లింక్‌ అయిన మొబైల్‌ తీసుకురావాలని, కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా నెలకు పరిమితంగానే ఇస్తామని చెప్పడంతో సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. కార్డుకు 26 కేజీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా.. పూర్థిస్తాయిలో అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు అటువైపు వెళ్లడం మానేశారు. ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement