సాయం చేయబోతే ప్రాణమే పోయింది | - | Sakshi
Sakshi News home page

సాయం చేయబోతే ప్రాణమే పోయింది

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

సాయం చేయబోతే ప్రాణమే పోయింది

మిర్యాలగూడ అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు మానవత్వంతో స్పందించిన ఒక వ్యక్తిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దుప్పలపూడికి చెందిన పొలినేని శ్రీనివాసరావు(36), ఆయన భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మిర్యాలగూడలోని అద్దంకి– నార్కట్‌పల్లి బైపాస్‌ నందిపాడు క్రాస్‌ రోడ్డు వద్ద హనుమాన్‌పేటకు చెందిన బొల్లెపల్లి వెంకటేశ్వర్లు బైక్‌ స్కిడ్‌ అయి రోడ్డుపై పడిపోయాడు. అతడిని గమనించిన శ్రీనివాసరావు తన కారును రోడ్డు పక్కకు నిలిపి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లోకి క్షతగాత్రుడిని ఎక్కిస్తున్న క్రమంలో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఎల్‌పీజీ గ్యాస్‌ లారీ అతివేగంగా వచ్చి అప్పటికే రోడ్డుపై ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈక్రమంలో శ్రీనివాసరావుపై నుంచి లారీ వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అంబులెన్స్‌లో ఉన్న మహిళా సిబ్బంది చిట్యాల స్వప్నకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ చెన్నకేశవులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సోమనర్సయ్య తెలిపారు.

మనకెందుకు నాన్న.. వెళ్లిపోదామని చెప్పినా వినలేదు

‘రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని చూసి మా నాన్న కారు ఆపారు. మనకెందుకు నాన్న, ఎవరైనా హెల్ప్‌ చేస్తారులే అని చెప్పినా వినలేదు’ అని శ్రీనివాసరావు 12 ఏళ్ల కుమారుడు కన్నీరుమున్నీరుగా రోధించాడు. మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు వెళ్లి కళ్లముందే లారీ కిందపడి మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నామని మృతుడి భార్య బోరున విలపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement