దళితులంటే అంత చిన్న చూపా! | - | Sakshi
Sakshi News home page

దళితులంటే అంత చిన్న చూపా!

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

● కమ్మ, కాపుల కోసమే కూటమి ప్రభుత్వం ఉందా! ● దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సిట్‌ ఏర్పాటు చేయాలి ● సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి ● ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

● కమ్మ, కాపుల కోసమే కూటమి ప్రభుత్వం ఉందా! ● దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సిట్‌ ఏర్పాటు చేయాలి ● సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి ● ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్‌): దళితులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు, కూటమి ప్రభుత్వం ఉన్నది కేవలం కమ్మ, కాపుల కోసమేనా అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన సీఐ, ఎస్‌ఐ, స్టేషన్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌, వైఎస్సార్‌ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ, దళిత, గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కమ్మ, కాపులకు ఉన్న విలువ దళితులకు లేదని విమర్శించారు. పోలీసుల దారుణాలకు సాయికృష్ణ, చీకటి గోపి బలయ్యారని అన్నారు. సాయికృష్ణపై 22 కేసులు ఉన్నాయని రౌడీషీట్‌, హత్య కేసు, గంజాయి, పోక్సా వంటి కేసులు ఉన్నాయని, చీకటి గోపిపై ఎలాంటి కేసులు లేవన్నారు. కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణ కోసం చంద్రబాబు ఆగమేఘాల మీద సిట్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సాయికృష్ణ సిట్‌ వ్యవహారంలో దళిత బిడ్డ హోం మంత్రి ఉన్నప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కాపులు, కమ్మ సామాజిక వర్గాల ఓట్లతోనే అధికారంలోకి రాలేదని, మాల, మాదిగల ఓట్లతో గద్దెనెక్కారన్న విషయాన్ని మరిచారన్నారు. చీకటీ గోపి నిజానికి జనసేన పార్టీ గ్రామ కార్యదర్శిగా ఉన్నాడన్న విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ మరిచారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు సుమారు 25 మంది దళిత యువకులు మృతి చెందారని కనీసం వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వర్గ పోరులో హత్యలు చేసుకుంటే వారిని పరామర్శించేందుకు మంత్రులు, చంద్రబాబు పార్టీ నాయకులు అధికారులు వెళ్లి వారికి పొలాలు, స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. చీకటి గోపి వ్యవహరంలో తక్షణమే సిట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఉద్యమం రాజధానినే అతలాకుతలం చేసే స్థాయికి చేరుతుందన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

నిష్పక్షపాతంగా విచారణ జరపాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్‌ బాబు) మాట్లాడుతూ చీకటి గోపి మృతి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందనే విషయాల్ని తేటతెల్లం చేయలేకపోయారన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోపి మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్‌ అధికారులు హోం మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం అన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, కాంగ్రెస్‌ పార్టీ, పలు దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement