చోరీ సొత్తు
స్వాధీనం
చీరాల: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను గురువారం చీరాల జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జీఆర్పీ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్ కొండయ్య వివరాలను వెల్లడించారు. ఈనెల 7వ తేదీ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఏ–1 కోచ్‌లో ప్రయాణిస్తున్న అసోంకు చెందిన చాణిక్య మెక్‌కు చెందిన ల్యాప్ టాప్ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ సంఘటనపై అతడు చీరాల రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జీఆర్పీ డీఎస్పీ జి.మురళీధర్ ఆదేశాల మేరకు జీఆర్పీ సీఐ ఎస్‌కే మౌలా షరీఫ్ ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్ కొండయ్య దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ హనుమంత్ నాయక్ నిందితునిగా గుర్తించారు. గురువారం చీరాల రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం 4 వద్ద అనుమానాస్పదంగా ఉన్న అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి లెనివో ల్యాప్‌టాప్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 –2023 వైఫై ట్యాబ్, ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ తదితర కార్డులు ఉన్న చిన్న జిప్ పర్సును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ప్రజలు రైలు ప్రయాణ సమయంలో విలువైన వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల కదలికల గురించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాలని జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ సూచించారు.


