లక్ష్మీపురం: రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో దళితులపై దాడులు గణనీయంగా పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. దొంగతనం నెపంతో మంగళగిరిలో హత్య గురైన మేకల రమేష్ కుటుంబ సభ్యులను తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో వి.శ్రీనివాసరావుతో పాటు కేవీపీఎస్ నాయకులు బుధవారం పరామర్శించారు. అలాగే పోలీసు దెబ్బలకు తాళలేక మృతిచెందిన దళిత యువకుడు చీకటి గోపి కుటుంబ సభ్యులను కూడా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో వారు పరామర్శించారు. అనంతరం గుంటూరులోని బ్రాడిపేట సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో దళితులు పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. పేదలు బడుగు వర్గాలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. దళితుల కేటాయించిన తాడికొండ నియోజకవర్గంలో ఈ ఘటనలపై ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించలేదన్నారు. దొంగతనం నెపంతో మేకల రమేష్ పెత్తందారులు కొట్టగా చనిపోగా, చీకటి గోపి పోలీసులు కొట్టడంతో చనిపోయాడని తెలిపారు. ఈ రెండు ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందన్నారు. తాడికొండ సీఐపై ఆరోపణలు వస్తే మేడికొండూరు సీఐని విచారణ అధికారిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే స్థాయి అధికారిని విచారణ అధికారిగా ఇలా నియమిస్తారా అని ప్రశ్నించారు. విచారణ పూర్తికాకుండానే పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే జ్వరంతో చీకటి గోపి మృతి చెందాడని డీఎస్పీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధితులను ఇంతవరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శించలేదన్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లి లో ఎస్టి యువకుడు కూడా దొంగతనం కేసులో మృతి చెందాడని ఆరోపించారు. ఈ ఘటనలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కాకినాడలో నిరుద్యోగుల ఆందోళనలను బూచిగా చూపి కోచింగ్ సెంటర్ల పై దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చడం ఏంటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్ ను 16 రాష్ట్రాలలో అమలు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ దళితుల పై దుర్మార్గమైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివద్ధి కన్నా పేదలపై దాడులు పెరిగాయన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం దళిత సంఘాలు చేయనున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు బి.లక్ష్మణరావు, జె.నవీన్‌ప్రకాష్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు


