నేతన్న సేవలో అక్రమాలపై విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

నేతన్న సేవలో అక్రమాలపై విచారణ జరపాలి

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

మంగళగిరి టౌన్‌: నేతన్న సేవా పథకంలో నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడిన పలువురు కార్మికులకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 25 వేల ఆర్తిక సహాయం అందించే నేతన్న సేవా పథకాన్ని ఆగస్టు 7 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల సంఖ్య 51,952 ఉండగా, సుమారు 71 వేల మందికి బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ అయినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పథకం అమలుకు ముందే కొందరు అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన పేర్లను జాబితాలో చేర్పించారని, చేనేత వృత్తితో సంబంధం లేని వారి పేర్లు కూడా నమోదు అయ్యాయని ఆరోపించారు. నిజంగా మగ్గం నేస్తున్న అర్హులైన కార్మికులకు పథకం అందలేదని, దీనిపై విచారణ కోరుతూ అధికారులకు జాబితాలు ఇచ్చినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు. రాయలసీమ జిల్లాల్లో పథకం అమలుపై ఆగస్టు 7కు ముందే పత్రికల్లో పలు ఆరోపణలు వెలువడ్డాయని తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పథకం అందేలా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. మరో 30 వేల మంది చేనేత కార్మికులకు రూ. 25 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఆగస్టు 30 నాటికి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని చేనేత మంత్రి ప్రకటించినప్పటికీ సెప్టెంబర్‌ 15 నాటికి కూడా నగదు జమ కాలేదని అన్నారు. దీంతో పథకం అమలుపై చేనేత కార్మికుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మిగిలిన అర్హులైన చేనేత కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేసి న్యాయం చేయాలని ఆయన ప్రకటనలో కోరారు.

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement