గుంటూరు కార్పొరేషన్‌లో 76 డి విజన్లు ఖరారు
నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) పరిధిలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. నగరంలో డివిజన్ల సంఖ్యను 57 నుంచి 76కు పెంచుతూ ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన వినతులు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఈ తుది నోటిఫికేషన్ ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పునర్విభజన జరిగిన 76 డివిజన్ల పరిధిలోని నాలుగు వైపులా సరిహద్దులు (ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం), విస్తరించిన కాలనీలు, డోర్ నంబర్ల వివరాలను గెజిట్‌లో స్పష్టంగా పొందుపరిచారు.
నగర శివారు ప్రాంతాలు, కొత్తగా విలీనమైన గ్రామాలు, ప్రధాన రహదారుల విస్తరణకు అనుగుణంగా వార్డుల రూపురేఖలను నిర్దేశించారు. పెరిగిన జనాభాకు తగినట్లుగా పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికే డివిజన్ల సంఖ్యను పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సరిహద్దుల విభజనే ప్రామాణికం కానుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు నయా డివిజన్ల లెక్కలపై దృష్టి సారించాయి. పూర్తి వివరాలు అధికారిక గెజిట్ ద్వారా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.


