● క్షేత్రస్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పనిభారం ● ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానం కల్పించాలని వినతి
మంగళగిరి టౌన్: ఎన్‌ఎల్‌ఈపీ, ఎల్‌సీడీసీ (ఎన్‌సీడీ–సీడీ) ఆరోగ్య సర్వేల్లో ప్రతి వ్యక్తికి ఏబీహెచ్‌ఏ రూపొందించి, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ తప్పనిసరి చేయడం క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జి.వీర పాండియన్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఓటీపీ కోసం ప్రజలను ఒప్పించేందుకు అదనపు సమయం వెచ్చించాల్సి రావడంతో సర్వే సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని వారు తెలిపారు. మొబైల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం, వ్యక్తిగత గోప్యత కారణంగా కొందరు ఓటీపీ చెప్పేందుకు నిరాకరించడం వంటి సమస్యలతో సర్వే ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. నిర్ణీత 14 రోజుల్లో ఎన్‌ఎల్‌ఈపీ సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ప్రతి వ్యక్తికి ఏబీహెచ్‌ఏ–ఓటీపీ ప్రక్రియను పునరావృతం చేయడం వల్ల రోజువారీ సర్వే లక్ష్యాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటీపీ సాధ్యం కాని సందర్భాల్లో ప్రత్యామ్నాయ ధ్రువీకరణకు అవకాశం కల్పించాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సరళమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌సీడీసీ ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, సిబ్బందిపై అదనపు భారం పడకుండా విధానాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉందని వెంకటసుబ్బయ్య, రమేష్‌బాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ నాయకులు సుజాత, స్పందనలతో పాటు సెక్రటరిలు వనిత జ్యోతి, నాగమణి, అరుణ, దుర్గ, సుకన్య, అంజలమ్మ, ఉషారాణి, ప్రతిభ, విజయకుమారి, కిరణ్‌కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


