● కార్మికుడు దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు ● విద్యుత్ సరఫరా నిలపకుండా పనులు చేయించడమే కారణం!
పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యూ పీటీఆర్ ఎరక్షన్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు.. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కాంట్రాక్టు మేస్త్రి నన్నెం దుర్గారావు (55) మరో ఇద్దరితో కలిసి పనుల నిమిత్తం సోమవారం పెద్దదోర్నాలకు చేరుకున్నారు. మంగళవారం సబ్‌స్టేషన్‌లో పనులు చేస్తుండగా దుర్గారావు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదాన్ని గమనించిన మిగతా సిబ్బంది భయంతో పైనుంచి కిందికి దూకడంతో వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు 24 గంటల ముందే అధికారులు సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ, సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండానే నిర్లక్ష్యంగా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.


