వివాహిత అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

కొల్లూరు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. మండలంలోని పెదలంక అరవింద వారధి సమీపంలో నివసిస్తున్న ఉప్పు శివవెంకటగోపయ్యకు 2020లో చీరాల, గోపాలకృష్ణపురానికి చెందిన శివ (25)తో వివాహం జరిగింది. శివ తల్లి వారం రోజుల క్రితం మృతి చెందడంతో సంప్రదాయం ప్రకారం గురువారం తన తల్లి గృహానికి స్వీట్లు తీసుకొని వెళ్లాల్చి ఉంది. మృతురాలు శివ రాకపోవడంతో మారు తండ్రి ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె వస్తున్నదీ లేనిదీ తెలుకునేందుకు ఫోన్‌లో ఆమెను సంప్రదించేందుకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. పదేపదే ఫోన్‌లు చేస్తూ ఉన్నా శివ ఫోన్‌ తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె బంధువులు సాయంత్రం చీరాల నుంచి మండలంలోని పెదలంకలో ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చారు. అప్పటికే ఆమె చనిపోయి ఉండటం గమనించి మృతురాలి భర్త శివవెంకటగోపయ్యను ప్రశ్నించారు. తాను బయటకు వెళ్లి వచ్చే సమయానికి ఆమె కింద పడిపోయి ఉందని, ఆమైపె తమ మూడేళ్ల కూతురు పడుకొని ఉందని బదులిచ్చాడు. ఆమె మృతిపై అనుమానంతో మృతదేహాన్ని పరిశీలించిన బంధువులు మెడ చుట్టూ గాయం ఉండడం గమనించారు. మృతురాలి బంధువులు వచ్చే సమయానికి మృతదేహాన్ని ఇంటిలో ఉంచి మృతురాలి భర్త, మరిది, తోటికోడళ్లు మాత్రమే ఉండటంతో శివ మరణించడంపై వారిని నిలదీశారు. తాము చూసేప్పటికే ఆమె చలనం లేకుండా ఉండటంతో కొల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించామని, అప్పటికే చనిపోయినట్లు వైద్యుడు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చామని ఆమె బంధువులకు బదులిచ్చారు. వారు నివసిస్తున్న రేకుల ఇంటిలో ఉరి పెట్టుకున్న ఆనవాళ్లు లేకపోవడంతో ఆమె మృతిపై అనుమానంతో కొల్లూరు పోలీసులకు శివ బంధువులు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కిశోర్‌బాబు మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి మారు తండ్రి చెన్నుపల్లి వీరసాయిబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శుక్రవారం తహసీల్దార్‌, ఎస్‌ఐల సమక్షంలో శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలికి ఐదు, మూడేళ్ల కుమార్తెలున్నారు. మృతురాలి భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement