నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలను అందచేశారు. ఎంపికై న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా పాఠశాలలను కేటాయించి నియామక పత్రాలు అందించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్‌ప్రసాద్, బాలికా శిశు సంక్షేమాభివృద్ధి అధికారి ఎన్.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఎంపికై న ఉపాధ్యాయినులు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, సహ ఉపాధ్యాయినులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఫలితాల సాధనలో పల్నాడు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కోరారు.
తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతోపాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో చేపట్టిన భద్రతా చర్యలను సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ డీస్పీ అలహరి శ్రీనివాస్, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణతోపాటు ట్రాఫిక్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో ఖాతాదారులకు కష్టాలు తప్పేలా లేవు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు ఆ తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో బ్యాంకు శాఖలు వరుసగా మూతపడనున్నాయి. దీంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, రుణాలకు సంబంధించిన పనులు, ఇతర బ్యాంకు సేవల కోసం బ్రాంచీలకు వెళ్లే ఖాతాదారులు ముందుగానే తమ పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్యాంకుల బంద్‌తో ప్రారంభం
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు బంద్ పాటించనున్నారు. ఐదు రోజుల పని విధానం అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. బంద్ కారణంగా బ్యాంకు శాఖల్లో సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు యథాతథంగానే ఖాతాదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
గుంటూరు మెడికల్: పారామెడికల్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ – ఏపీ ఆధ్వర్యాన ఈ నెల 13న గుంటూరులో రణభేరి ప్రాంతీయ సదస్సు నిర్వహించనన్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రమేష్‌బాబు చెప్పారు. గురువారం గుంటూరు జీజీహెచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు వేలల్లో ఉన్నారని చెప్పారు. మూడు జిల్లాల ఉద్యోగులతో రణభేరి ప్రాంతీయ సదస్సు గుంటూరులో నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో టీబీ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్యామ్, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.


