బాపట్లటౌన్: మహిళ శిశు అభివృద్ధి, సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎస్.సువర్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బదిలీపై బాపట్ల జిల్లాకు వచ్చిన సువర్ణ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆ శాఖ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ పీడీగా పనిచేసిన రాధా మాధవి ఏఎస్‌ఆర్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ షేక్ సలీమ్ బాషా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, మండల పరిషత్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు అక్టోబర్ 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలని, నవంబర్ 15 పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చొప్పున ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
ప్రమాదంలో విద్యార్థి మృతి
పట్నంబజారు: పాఠశాల విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతీనగర్‌లో నివాసం ఉండే షేక్ సయిద్ గురువారం తన సోదరులైన సౌద్ (14) తొమ్మిది తరగతి చదువుతున్నాడు. అసద్‌తో కలిసి కేఎల్‌పీ పాఠశాలలో దింపేందుకు వెళుతున్నాడు. మారుతీనగర్ నుంచి గుజ్జనగుండ్ల వెళుతున్న సమయంలో కుడి చేతిపక్క ఆటో, ఎడమ చేతి వైపు పాఠశాల బస్సు మధ్యలో ఉన్న క్రమంలో ద్విచక్రవాహనానికి ఢీకొంది. ఈక్రమంలో ముగ్గురు కిందపడ్డారు. 9వ తరగతి చదువుతున్న సౌద్ (14)పై పాఠశాల బస్సు ఎక్కడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అసద్‌కు చెయ్యి విరిగింది. సయిద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు వెస్ట్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను పొందేందుకు కోర్టు ఫీజు లేదని, పరస్పర అంగీకారంతో పరిష్కారం అవుతుందని, త్వరగా న్యాయం లభిస్తుందని చెప్పారు. అన్ని కోర్టుల పరిధిలో జరుగుతుందన్నారు. అనంతరం జేసి జాతీయ లోక్ అదాలత్ పోస్టర్‌ను విడుదల చేశారు. డీఆర్‌ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
పంట కాలువలోకి
దూసుకెళ్లిన కారు
అత్తోట(కొల్లిపర): మండల పరిధిలోని అత్తోట గ్రామశివారు డొంక రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి చోటుచోసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తోట గ్రామానికి చెందిన కొంతమంది కారులో తెనాలి వెళుతున్నారు. గ్రామ శివారులోని డొంక రోడ్డులో మలుపు గమనించకపోవటంతో కారు ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న కొంత మంది వెంటనే కారులోని వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు.
స్కూటీ దొంగలు అరెస్ట్
పెదనందిపాడు: ఇళ్ల ముందు తాళాలు వేసి ఉంచిన స్కూటీలను మాయం చేసే దొంగలను అరెస్ట్ చేసినట్లు ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు తెలిపారు. గురువారం పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. గతంలో పలు స్కూటీ లు దొంగతనం చేసి వాటిని తక్కువ ధరలను అమ్ముకుని జల్సాలు చేస్తున్న యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బారావు చెప్పారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన షేక్ జమీర్, షేక్ అబ్దుల్లా, షేక్ యాసిన్ లను చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారి అధీనంలో ఉన్న ఐదు స్కూటీ లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. వాటి విలువ రూ.2.30లక్షలు ఉంటుందని తెలిపారు.


