డిప్యూటీ డీఈఓ డి.గంగాధర్
బాపట్లటౌన్ : క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని డిప్యూటీ డీఈవో డి.గంగాధర్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ డీఈవో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత, భావోద్వేగాలను ఆరోగ్యకరంగా వ్యక్తీకరించడం, ఒత్తిడి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సహాయం కోరడంలో సంకోచించకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కనిపించే మానసిక ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి సంకేతాలను గుర్తించి, అవసరమైన సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కౌన్సెలర్లు మరియు ఇతర విశ్వసనీయ వ్యక్తుల సహాయం పొందాలని సూచించారు. ‘ఒకరి మాట వినడం, ఒకరిని అర్థం చేసుకోవడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడం ఒక ప్రాణాన్ని కాపాడగలదు’ అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి, సహాయం కోరే సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కౌన్సిలర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎం.చారులత, బాపట్ల మున్సిపల్ హైస్కూల్ హెచ్‌ఎం బి.రాజశ్రీ, జిల్లా కౌన్సెలర్ బృందం నుంచి టి.కళ్యాణ్, కె.రామకృష్ణా రెడ్డి, బి.వేణుగోపాలరావు, సౌజన్య, కె.ఇందిర, నాగలక్ష్మి, రాగల జవహర్ పాల్గొన్నారు.


