బాపట్ల టౌన్: ప్రభుత్వం ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై ఎందుకింత మొండి వైఖరి అవలంబిస్తుందో అర్థం కావడం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఉద్యోగులు బైఠాయించారు. కళ్లు, చెవులు, నోరు మూసుకొని నల్లబ్యాడ్జీలతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ శాంతియుత నిరసనలు కొనసాగుతాయన్నారు. ఈ క్రమంలో ఆరోగ్య కేంద్రాలలో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలను పూర్తిస్థాయిలో నిరాటంకంగా కొనసాగిస్తామని చెప్పారు. రోజూ డ్యూటీలో నల్ల బ్యాడ్జ్‌లు పెట్టుకుని, భోజన విరామంలో శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు ఆన్‌లైన్, నెలవారీ రిపోర్టులు ప్రభుత్వానికి అందచేయకుండా కార్యాచరణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్‌లు అనూష, తబిత, ఫార్మసిస్ట్‌లు నళిని, శాంతి మనోజ, ల్యాబ్ టెక్నీషియన్‌లు నీలిమ, సునీత, బయో మెడికల్ ఇంజినీర్ నళిని కుమారి తదితరులు పాల్గొన్నారు.


