రాజుపాలెం: ప్రకృతి వ్యవసాయంలో అమలు చేస్తున్న పంటల వైవిధ్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపు విధానాలు ఆదర్శంగా నిలుస్తాయని యూకేకు చెందిన గ్రోయింగ్ రియల్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ సంస్థ కో ఫౌండర్ మాథ్యూ పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు గుర్రాల మల్లికార్జురావు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మాథ్యూ, పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారిలు బుధవారం పరిశీలించారు. క్షేత్రంలో పది రకాల పండ్ల మొక్కలతోపాటు పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాథ్యూ.. పొలంలోని నేల పరిస్థితి, వానపాముల ఉనికి, నేలలో సూక్మజీవుల చురుకుదనం, పంటల వైవిధ్యం, ఎరువుల తయారీ తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు.


