బాపట్ల: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఉన్న చట్టాలను అమలు చేయటంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించాలని ఎస్టీ, ఎస్సీ హక్కుల సంక్షేమ సంఘం, సమరత సేవా ఫౌండేషన్ నాయకులు కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం రిజర్వేషన్లును అమలు చేయాలని సూచించారు. వినతి పత్రం ఇచ్చినవారిలో జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ, మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి, ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, ప్రభుత్వ సంబంధాల ప్రముఖ్ బొలగాని వెంకటేశ్వర్లు, చిల్లా సత్యనారాయణ, మోదడుగు సూరిబాబు, దండుప్రోలు వెంకట్రావు, తులసి రాజేష్ పాల్గొన్నారు.
వేర్వేరు ఘటనల్లో ఇరువురు ఆత్మహత్య
రేపల్లె: వేర్వేరు ఘటనల్లో ఇరువురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాన్సర్ వ్యాధితో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఉరిపెట్టుకుని మృతి చెందాడు.. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని నల్లూరు సౌత్ గ్రామానికి చెందిన నల్లూరు అరుణకుమారి (45)కి బుధవారం ఇంట్లో ఉరి పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అరుణకుమారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అరుణకుమారి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి రావులపు సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా గుడ్డికాయలంక గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (30) కుటుంబ కలహాల నేపథ్యంలో గృహ సమీపంలోని మామిడి చెట్టుకు ఉరిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీనాగరాజును ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే అతని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
నేడు దశాబ్ది ఉత్సవాలు
నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బాలస్వామి, మోన్సిగ్నోర్ చాట్ల మరియదాసు, పూదోట దానయ్య, దాసరి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు రింగ్ రోడ్డులోని బిషప్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి బిషప్ హౌస్ వరకు ప్రదక్షిణ (ఊరేగింపు) ప్రారంభం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు డాన్‌బాస్కో మైదానంలో ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించనున్నట్లు వివరించారు. అనంతరం బిషప్ భాగ్యయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని హాజరుకానున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బిషప్‌లు, గురువులు, కన్యాసీ్త్రలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొంటారని వివరించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పీడీఎఫ్ లక్ష్యం
మంగళగిరి టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే పిడిఎఫ్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో కృష్ణా – గుంటూరు ఉమ్మడి జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి 2027 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపర్చిన పీడీఎఫ్ అభ్యర్ధిగా ఎం.హనుమంతరావు పరిచయ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులతో సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నికై నిజాయితీగా పనిచేశారని గుర్తుచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావుకు వివిధ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి ఆయన విజయానికి సమష్టిగా కృషిచేస్తామని వెల్లడించారు.


