వృద్ధురాలికి ప్రజాసంఘాల నాయకుల పరామర్శ
చీరాల: వృద్ధురాలిపై టూటౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించి అసభ్యపదజాలంతో దూషించిన ఘటనపై ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు, ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. సోమవారం ఆమె ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ.. వృద్ధురాలిని అసభ్యంగా దూషించిన సీఐపై చర్యలు తీసుకోకుంటే ప్రజాసంఘాలతో కలిసి దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ ఘటనతో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురైందని, పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరమన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సంయమనం పాటించకుండా దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు చట్టాలకు అతీతులు కారని, టూటౌన్ సీఐపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మోహన్‌కుమార్ ధర్మా, బలహీనవర్గాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శవనం శామ్యూల్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు బి.లక్ష్మీనరసయ్య, డి.వందనం, వైహెచ్‌పిఎస్ నాయకులు మొగిలి ప్రతాప్, కె.ఉమాదేవి, మొగిలి శబరి, బ్రహ్మయ్య, పి.పోలయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్
గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య ప్రవేశాలకు 2020 డిసెంబరు 4న విడుదల చేసిన జీఓఎంఎస్ నంబరు 151ని అమలు కొనసాగించాలని, 2026 జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102ను పునః పరిశీలించాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం అమరావతి రోడ్డులోని ఆలా ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. జీవో ఎంఎస్ నంబరు 102తో నిబంధనలు డబ్ల్యూపీ నంబరు 11018/2019లో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా 2020 డిసెంబరు 4న ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబరు 151ని జారీ చేసిందన్నారు. జీఓ నంబరు 102 రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థులకు నష్టం కలిగించడమే కాకుండా సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102లోని నిబంధనలను పునః పరిశీలించాలని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్ని ఎంపికల విధానాన్ని కొనసాగించాలని, జీఓ 151ని మార్పులు చేయకుండా అమలు చేయాలని కోరారు.


