చిలకలూరిపేటటౌన్:అప్పుల ఒత్తిడితో అపార్టుమెంట్ లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల ఏడుకొండలు(32) కుటుంబంతో ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట చిలకలూరిపేట వచ్చారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ వెనుక ఎన్‌వీ నారాయణపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. నాటి నుంచి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్న ఏడుకొండలకు సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. తీవ్ర మనస్తాపానికి గురవుతున్న ఆయన రెండు నెలలుగా విధులకు వెళ్లడం లేదు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఏడుకొండలుకు భార్య సాగరికతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.


