భట్టిప్రోలు: మండల పరిధిలోని వెల్లటూరు పంచాయతీకి చెందిన ఉత్తర సంఘం కాలనీలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన సొసైటీ భూములకు వెళ్లే డొంకరోడ్డు అభివృద్ధి చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రైతులతో కలసి డొంక రోడ్డును కాలినడకన పరిశీలించారు. తర్వాత అశోక్‌బాబు మాట్లాడుతూ ఉత్తర సంఘం దళిత రైతులకు ఇది జీవనాధారమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ డొంక రోడ్డుకు మెరక పోయకపోవడంతో వర్షం వస్తే మోకాలి లోతు బురదలో పంటను మోసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్లు, వాహనాలు వెళ్లలేక పండించిన పంటను చేతులతో మోసుకుని మెయిన్ రోడ్డుకు చేర్చుతున్నారని చెప్పారు. మూడుసార్లు గెలిచానని చెప్పుకొనే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు ఈ పేద దళితుల కష్టం కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఒక్క డొంక రోడ్డును కూడా సరి చేయలేని దుస్థితిలో ఉందన్నారు. రైతు సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకొనే వారికి క్షేత్రస్థాయిలో రైతుల కష్టం తెలియడం లేదా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. సొసైటీ డొంక రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.


