చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఒకవైపు మేత ధరలు... మరోవైపు రొయ్యల కొనుగోలు ధరల మధ్య డాలర్ల పంటగా పిలుచుకునే ఆక్వా రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేస్తున్నారు. పెట్టుబడులు పెంచేలా చేసి, రాబడి తగ్గించే విధంగా కంపెనీలు చేస్తున్నప్పటికీ ఆక్వా రైతులు అప్పులు చేసి పంట సాగుకు పాట్లు పడుతున్నారు. రెండేళ్లుగా వరుస సంక్షోభాలతో గిట్టుబాటు కాక నష్టాల్లో మునిగిపోతున్నారు.
వేటపాలెం: బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల, వేటపాలెం, చిన్నగంజాం మండలాల పరిధిలో 23,868 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా రైతులు 70 శాతం టైగర్ రొయ్య, 30 శాతం వనామా రకం రొయ్యల సాగు చేస్తున్నారు. వనామా రకం రొయ్యలు ఎక్కువగా తెగుళ్ల బారిన పడుతుండటంతో గత ఏడాది నుంచి రైతులు టైగర్ రొయ్యలు సాగు చేస్తున్నారు. ఈ రకం రొయ్యలకు ధరలు పెరగడంతో ఎక్కువ మంది రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు రకాల సాగుతో స్థానిక రైతులు ఏటా రూ.వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు.
రెండోసారి పెంపు
తాజాగా రొయ్యల మేత ధరలను ఆయా కంపెనీలు పెంచేశాయి. ఈసారి ఏకంగా వనామీ రొయ్యల మేత టన్నుకు రూ.5,700, టైగర్ మేతకు రూ.3,850 చొప్పున ధర పెంచుతూ ఆయా కంపెనీలు తమ డీలర్లకు లేఖలు రాశాయి. పెంచిన ధరలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలకు మరోసారి భారం తోడైంది. గత ఆరు నెలల కాలంలో మేత ధరలను పెంచడం ఇది మూడోసారి. సుమారు రూ.16 వేల తాజా పెంపుతో టన్ను ధర రూ.21,500కు చేరిందని రైతులు చెబుతున్నారు. ఆరు నెలల్లోనే మేత ధరలను మూడుసార్లు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు.
ఇంకా పెంచే యత్నం..
కంపెనీలే టన్నుకు రూ.15 వేల వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగా రూ.5,700 పెంచినట్లు చెబుతున్నారు. తరువాత దశలవారీగా ధరలు పెంచనున్నట్లు సమాచారం. వనామీ రొయ్యల మేత ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ధరల పెంపుపై జిల్లాకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మేత కంపెనీలకు, కొనుగోలుదారుల సిండికేట్‌కు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మేత కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అనుకూలంగా మారిందని రైతులు మండిపడుతున్నారు.
రెండేళ్లుగా వరుస నష్టాలు
ఇంత భారం మోస్తున్నా తమకు పంట అమ్మకంలోనూ ఊరట లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమెరికా సుంకాల ప్రభావం, తెగుళ్లతో నష్టపోయిన రైతులకు ఈ ఏడాది యుద్ధం పేరుతో కొనుగోలుదారులు కేజీ కౌంట్‌కు రూ.35 నుంచి రూ.40 వరకు ధరలు తగ్గించారు. తరువాత ధరలు పెంచినా, అది రైతుల వద్ద రొయ్యలు లేప్పుడు మాత్రమే.. అమెరికా, యూరప్‌లకు 30 నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు ఎగుమతి అవుతున్నప్పటికీ యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు తగ్గించడం అన్యాయమంటున్నారు. రూ.100 కౌంట్ నుంచి 69 కౌంట్ వరకు ధరలు తగ్గించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పెంపుతో టన్నుకు రూ.5,700 అదనంగా చెల్లించాల్సి రావడంతో ఎకరాకు రూ.91,200 అదనపు భారం పడుతోంది. ఆరు నెలల్లో మొత్తం మేత ధర పెరుగుదల ప్రభావాన్ని లెక్కిస్తే ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావడం గమనార్హం.


