రేపల్లె: ఉదయం వెలుతురు పడకముందే ఒక ఇంటి దీపం ఆరిపోయింది. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన యువకుడి ప్రయాణం ఒక్క క్షణంలో ముగిసిన విషాద ఘటన రేపల్లె మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెనుమూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ యేమినేని నాగమహేష్ (32) మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వాకావారిపాలెం గ్రామానికి చెందిన నాగమహేష్ రోజు మాదిరిగానే ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులను రేపల్లెలో దింపి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో పెనుమూడి సమీపంలో గంగడిపాలెం వెళ్లే రహదారి వైపు మర్రిచెట్టును ఢీకొన్నాడు. అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నాగమహేష్‌కు ఆరు నెలల క్రితమే నిజాంపట్నం మండలం మహిళతో వివాహమైంది. వారి దాంపత్య జీవితం ఇలా మధ్యలోనే ముగియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘ఇప్పుడే జీవితం మొదలుపెట్టాం.. ఇంత త్వరగా ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అంటూ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబసభ్యులు, బంధువుల విషాదం చూసిన చూపరులు సైతం కంటతడిపెట్టారు. నిద్రమత్తుగానీ, అలసట కారణంగాగానీ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.


