మాచర్ల: ఇటీవల అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంబటి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఉత్సాహంగా కూడో జిల్లా స్థాయి పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా కూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ స్థానిక బీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆర్.సిద్ధార్థ వర్మ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను విశాఖపట్నంలో సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ బ్లాక్ బెల్ట్ 7వ డాన్ డి.ప్రభాకర్ పాల్గొన్నారు.
కరాటేతో క్రమశిక్షణ, ఆత్మరక్షణ
మంగళగిరి టౌన్: కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మరక్షణ కూడా అలవాటు అవుతుందని ఎయిమ్స్(అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్)కు చెందిన డాక్టర్ శుభోదీప్ మిత్ర తెలిపారు. మంగళగిరి పట్టణంలోని స్వేచ్ఛ బుద్ధ విహార్‌లో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్(జేకేఏ) క్యూ లెవల్ బెల్డ్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. శుభోదీప్ మిత్ర మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటే విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు జేకేఏ ఏపీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ రవిబాబు, జోనల్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ సాగరిక పాల్గొన్నారు.
అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట
పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14వ తేదీన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్‌తాడు కనిపించడం లేదని ఆలయ అర్చకులు అధికారుల దృష్టికి తెచ్చారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఐదుగుర్ని సస్పెండ్ కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆభరణాల కోసం సంబంధిత చెత్త వేసే ప్రదేశంలో వెతికారు.
నేడు జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
బాపట్ల: స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు.


