9న గిరిజన దినోత్సవం నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

9న గిరిజన దినోత్సవం నిర్వహించాలి

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

9న గిరిజన దినోత్సవం నిర్వహించాలి చెక్కు బౌన్స్‌ కేసులో ఆరు నెలలు జైలు

ప్రతి జిల్లాకు రూ.2 లక్షలు నిధులు కేటాయించాలి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమాఖ్య డిమాండ్‌

నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 9వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్‌ ప్రభుత్వాన్ని కోరారు. అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గిరిజన సమాఖ్య ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి ఆగస్ట్‌ 9వ తేదీని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రానికి రూ.2లక్షలు కేటాయించి గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసారు. గిరిజనులు మన్యం ప్రాంతంలో వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతూ చిన్న చిన్న తండాలు, గూడెంలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూలు గిరిజనులకు భూమిపై హక్కును కల్పిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పటికై నా గిరిజనుల జీవనశైలిని గుర్తించి వారి అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో గిరిజన సమాఖ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కోయ శ్రీను, సహాయ కార్యదర్శి పాలపర్తి వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, మొగిలి అనూరాధ పాల్గొన్నారు.

రూ.10 వేలు జరిమానా

సత్తెనపల్లి: చెక్కు బౌన్స్‌ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమాన విధిస్తూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థాన న్యాయమూర్తి పి.ప్రియదర్శిని మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణంలోని బోయ కాలనీలో నివాసం ఉండే బంటుపల్లి సూర్యనారాయణ అనే వ్యక్తి దగ్గర విజయవాడ దుర్గాపురం పున్నయ్య కాలనీ నివాసి అయిన తుమ్మల నాగేంద్ర ప్రసాద్‌ తన కుటుంబ, వ్యాపార అవసరాల నిమిత్తం రూ. 1.30 లక్షలు అప్పుగా తీసుకోని 2017 మే 15న ఒక ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. సదరు బాకీ తీర్చమని సూర్యనారాయణ కోరగా నాగేంద్రప్రసాద్‌ సింగ్‌ నగర్‌ బ్రాంచి ఎస్‌బీఐ కి చెందిన చెక్కును రూ. 1.30 లక్షలకు 2018 జూన్‌ 27న ఇచ్చాడు. ఆ చెక్కును కలక్షన్‌ నిమిత్తం ఫిర్యాది తన బ్యాంక్‌ అకౌంట్‌ అయిన సత్తెనపల్లి విజయబ్యాంక్‌ లో ప్రెజెంట్‌ చేయగా ముద్దాయి అకౌంట్‌ బ్లాక్‌డ్‌ అని చెక్కుబౌన్స్‌ అయ్యింది. దీంతో సూర్యనారాయణ న్యాయస్థానంలో చెక్కుబౌన్స్‌ కేసు వేయగా సుధీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ప్రియదర్శిని తీర్పువెలువరించారు. జరిమానా రూ. 10 వేలు చెల్లించటంతో ఆరు నెలలు జైలు శిక్ష విధించారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితుడికి నాలుగు నెలల జైలు..

మాచర్ల: వెల్దుర్తి మండల పరిధిలోని శిరిగిరిపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు వద్ద బొల్లాపల్లి మండల పరిధిలోని గండిగనుముల గ్రామానికి చెందిన దేవయ్య 2019లో రూ.5,40,000లు అప్పుగా తీసుకున్నాడు. ఈ మేరకు బాకీ తీర్చేందుకు వెంకటేశ్వర్లుకు అదే సంవత్సరంలో చెక్కు ఇచ్చాడు. చెక్కు బౌన్స్‌ కాగా బాధితుడు మాచర్ల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు విచారణ జరిపి మంగళవారం అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌ కల్యాణ్‌ తీర్పునిస్తూ కిన్నెర దేవయ్యకు నాలుగు నెలల శిక్షతోపాటు రూ.10,80,000 చెల్లించాలని తీర్పునిచ్చారు. దీంతో పాటు నష్టపరిహారంగా మరో రూ.2,70,000 చెల్లించాలని లేదా మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement