ఓట్లపైనా రాజకీయమేనా సర్‌? | - | Sakshi
Sakshi News home page

ఓట్లపైనా రాజకీయమేనా సర్‌?

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

అధికార పార్టీ నేతల కుట్రలతో ఓట్లు గల్లంతు

ఒకే గ్రామంలో నాలుగొందలకుపైగా ఓట్లు మాయం

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో అక్రమాలు

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే లక్ష్యంగా కుట్రలు

మాజీ ఎంపీపీ సహా సర్పంచ్‌,

ఎంపీటీసీ కుటుంబసభ్యులూ బాధితులే

ఎన్నికల సంఘానికి, పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకున్న అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ నేతలు, వారి మద్దతుదారుల ఓట్ల తొలగింపే ధ్యేయంగా కుయుక్తులు పన్నారు. ఇలా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఏకంగా నాలుగు వందలకుపైగా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ఓట్లను ఎటువంటి కారణం లేకుండా తొలగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఎటువంటి విచారణ లేకుండానే ఓట్ల తొలగింపునకు బీఎల్‌వోలు పాల్పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తహసీల్దారుకు లిఖితపూర్వకంగా వినతి ఇచ్చినా దాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. 167, 168 బూత్‌లలో 190 మంది ఓట్లు తొలగించడం గమనార్హం. గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో ఉంటున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరి ఓట్లను తొలగించే కుట్రకు అధికార పార్టీ నేతలు తెరతీశారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆయన స్వగ్రామంలో కాకుండా జిల్లా కేంద్రమైన గుంటూరులో, ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నప్పటికీ వారి ఓట్లు తొలగించలేదు. అదే అధికారులు... నియోజకవర్గంలోనే ఉంటున్న వారి ఓట్లను మాత్రం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. మన్నవలోనే కాకుండా అనేక గ్రామాల్లో సైతం ఇలాగే కుట్రపూరితంగా ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే అధికార పార్టీ చేసే ఓటు చోరీలో పలువురి ఓట్లు పోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతా అడ్డగోలుగానే...

మన్నవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ బొనిగల వేణుప్రసాద్‌ ఓటు గల్లంతు అయింది. ప్రస్తుత మాజీ సర్పంచ్‌ ఓటు ఉంచి, ఆయన భార్య బొనిగల సుభాషిణి ఓటు తొలగించారు. అదేవిధంగా ప్రస్తుత మన్నవ ఎంపీటీసీ ఓటు ఉంచిన అధికారులు... ఆయన భార్య బొనిగల దేవి, కుమారుడు బొనిగల అభినాగ్‌ పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. వీరితో పాటు గ్రామానికి చెందిన సుమారు 400 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించిన వైనం బయటపడింది. వీరంతా మండల కేంద్రమైన పొన్నూరులో ఉపాధి, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇళ్లు, ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు గ్రామంలోనే ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా గ్రామంలోనే వీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ నేతల ఒత్తిడితో వీరి ఓట్లను బీఎల్‌వోలు తొలగించడం గమనార్హం. బాధితులు ఎన్నికల కమిషన్‌కు, పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement