తీరంపై కబ్జాదారుల కన్ను! | - | Sakshi
Sakshi News home page

తీరంపై కబ్జాదారుల కన్ను!

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

భూముల విలువ పెరగడంతో ఆక్రమణలకు బరితెగింపు నాలుగు చోట్ల భూకబ్జాలు.. సర్కారు భూములకు ఎసరు

ప్రైవేటు, అసైన్‌డ్‌ భూములపై కన్నేసిన భూ మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతున్న ఆక్రమణదారులు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు

రైతులనూ వదలరా?

చీరాల నియోజకవర్గ సముద్రతీర ప్రాంతం పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్కడి భూముల విలువలు అనూహ్యంగా పెరిగాయి. గోవా తరహాలో అభివృద్ధి చెందుతున్న తీర ప్రాంతంలో సముద్రానికి ఆనుకుని ఉన్న భూములు ఎకరాకు రూ.8 నుంచి రూ.9 కోట్లు వరకు పలుకుతున్నాయి. ఈ సముద్ర తీరానికి చేరుకోవడానికి బైపాస్‌ నుంచి వాడరేవు, వేటపాలెం మండల పరిధిలోని రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూములు కూడా ఎకరాకు రూ.3 నుంచి రూ.4 కోట్లు ధర పలుకుతున్నాయి. దీంతో ఈ ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. అదే సమయంలో అక్రమార్కుల కన్ను వీటిపై పడింది.
భూముల విలువ పెరగడంతో ఆక్రమణలకు బరితెగింపు

వేటపాలెం: భూముల ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకుని కబ్జాదారులు రంగంలోకి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు భూములు కొనుగోలు చేస్తున్న తరుణంలో స్థానికంగా కొందరు వ్యక్తులు అసలు యజమానులకు తెలియకుండా వారి ప్రైవేటు భూముల్లోకి చొరబడి సరిహద్దులు మార్చడం, కంచెలు వేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.

చీరాల నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట రెవెన్యూ పరిధిలో రెండు చోట్ల, వేటపాలెం మండలం బైపాస్‌ రోడ్డు నుంచి కఠారివారిపాలెం సముద్రతీరానికి వెళ్లే రోడ్డులో రెండు చోట్ల భూకబ్జాలు వెలుగు చూసినట్లు సమాచారం. అయినప్పటికీ రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు కనిపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులపై దర్యాప్తు పేరిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల అసలు దర్యాప్తు కూడా ప్రారంభం కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారం వినిపిస్తోంది. అదే కారణంగా అధికార యంత్రాంగం కఠిన చర్యలకు వెనుకాడుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు కావడంతో భూకబ్జా వ్యవహారాలు మరింత ముదురుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

భూకబ్జా ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటు, అసైన్‌డ్‌ భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. నకిలీ పట్టాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలపై ప్రత్యేక దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూముల విలువ అమాంతం పెరగడం అభివృద్ధికి సంకేతమే అయినప్పటికీ, అదే ప్రగతి ఇక్కడి భూముల కబ్జాకు వేదికగా మారితే ప్రజల ఆస్తి హక్కులే ప్రమాదంలో పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాలుగా అసైన్‌డ్‌ భూములను కొందరు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. వాటికి దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ భూములపై రైతులకు సాగు హక్కులు ఉన్నప్పటికీ రికార్డుల్లో మార్పులు చేసి ఇతరుల పేరిట మార్చే యత్నాలు చేస్తున్నట్లు బాధితులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement